
బాబా రాందేవ్‌కు డాక్టరేట్?
ప్రముఖ యోగా గురువు రాందేవ్‌కు హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
చండీగఢ్: ప్రముఖ యోగా గురువు రాందేవ్‌కు హర్యానా వ్యవసాయ విశ్వవిద్యాలయం త్వరలో గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. విశ్వవిద్యాలయం 24వ స్నాతకోత్సవం ఈనెల 26వ తేదీన జరగుతోంది. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం అధికారులు రాందేవ్ బాబాను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అదే కార్యక్రమంలో పాల్గొనే రాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్ నుంచి ఆయన డాక్టరేట్‌ను స్వీకరిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి.
హర్యానా రాష్ట్రానికి చెందిన రాందేవ్ ఏడవ తరగతి కూడా పూర్తిచేయకుండా చదువుకు అర్ధాంతరంగా స్వస్తి చెప్పారు. గౌరవ డాక్టరేట్ ప్రదానం కోసం దాందేవ్ అనుమతి కోరుతూ ఆయనకు విశ్వవిద్యాలయ అధికారులు లేఖ కూడా రాసినట్టు తెల్సింది. ఇంతకుముందు ఈ విశ్వవిద్యాలయం మాజీ ప్రధానులు చౌదరి చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్, మాజీ డిప్యూటి ప్రధాని చౌదరి దేవీలాల్ తదితరులకు గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేసింది.