జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు పెంచుతారా?

Will zptc and MPTC positions increase? - Sakshi

పునర్విభజనలో చిన్న జిల్లాల ఏర్పాటుతో సమస్యలు 

జెడ్పీలు, ఎంపీపీల ఏర్పాటుపై అధికారుల మీమాంస

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాలు, మండలాల పునర్విభజనలో భాగంగా కొన్నింటి పరిధి మరీ చిన్నగా మారడం ఇప్పుడు సమస్యగా పరిణమిస్తోంది. గతంలోని ఉమ్మడి 9 జిల్లా పరిషత్‌ల స్థానంలో కొత్తగా 32 జిల్లా పరిషత్‌లు ఏర్పడనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్వి భజనలో పరిమితంగా కొన్ని మండలాలతో ఏర్పడిన కొన్ని జెడ్పీలు, పరిమితంగా కొన్ని గ్రామాలతో ఏర్పడిన కొన్ని మండల ప్రజాపరిషత్‌లలో పాలకవర్గాలను ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న మీమాంసకు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు గురవుతున్నారు. మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా పరిధిలో 4 గ్రామీణ మండలాలు, వరంగల్‌–అర్బన్‌ జిల్లాలో 7 గ్రామీణ మండలాలు, నారాయణపేటతోపాటు కొన్ని జిల్లాల్లోనూ తక్కువ సంఖ్యలో మండలాలు ఉండడంతో అలాంటి చోట్ల పాలకవర్గాలను ఎలా ఏర్పాటు చేస్తే బావుంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. కొన్ని స్థానాలే ఉన్నచోట జెడ్పీపీ చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్‌ పదవులు పోగా మిగిలినసభ్యుల సంఖ్య  తక్కువగా ఉంటే ఆ జెడ్పీ లేదా ఎంపీపీ మనుగడ ఎలా అని అధికారులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  

15–20 వేల జనాభాకు ఒక జెడ్పీటీసీ...
గతంలో ఒక మండలాన్ని జెడ్పీటీసీ స్థానంగా, గ్రామాన్ని లేదా మూడున్నర నాలుగు వేల జనాభా గత ప్రాంతాన్ని ఎంపీటీసీగా పరిగణిస్తూ వచ్చారు. కొత్తగా 32 జిల్లాలు ఏర్పడిన దృష్ట్యా, మండలాల సంఖ్య మరీ తక్కువగా ఉన్న జిల్లాల్లో, గ్రామాల సంఖ్య తక్కువగా ఉన్న మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ సీట్ల సంఖ్య పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. జెడ్పీటీసీ స్థానాలను  15–20 వేల మధ్య జనాభాకు ఒక జెడ్పీటీసీ స్థానం ఏర్పాటు చేయాలని, రెండున్నర, మూడువేల జనాభాలోపు ఎంపీటీసీ స్థానంగా పరిగణించాలని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించినట్టు తెలుస్తోంది. ఆయా పదవులకు రిజర్వేషన్లు ఖరారు కానున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చునని అధికారులు ఆశాభావంతో ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top