
సాక్షి, హైదరాబాద్: కార్మికులకు టీఆర్‌ఎస్ ఎప్పటికీ అండగా ఉంటుందని మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల కోసం బీమా సదుపాయం కల్పించిందని పేర్కొన్నారు. తెలంగాణభవన్‌లో జరిగిన నిర్మాణ కార్మికుల ఆశీర్వాదసభలో నాయిని ప్రసంగించారు. ‘రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకుంది.
పేద ఇంటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు అమలు చేసి ఆ వర్గాలకు బాసటగా నిలుస్తున్నాం. రాహుల్ గాంధీ, చంద్రబాబు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. తెలంగాణ ఏర్పాటులో జాప్యం చేసి కాంగ్రెస్ 1,200 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మన ప్రాజెక్టులను అడ్డుకోవటానికి చంద్రబాబు లేఖలు రాశాడు. ప్రజాకూటమిని తరిమి కొట్టి టీఆర్‌ఎస్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలి’అని ఆయన వ్యాఖ్యానించారు.