వేలికి బ్లూ మార్క్‌ లేకుంటే..నొసటన బ్లాక్‌ మార్కే

Tamilisai Soundararajan Speaks Over National Voters Day - Sakshi

జాతీయ ఓటరు దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

ప్రజాస్వామ్య దినోత్సవంగా ఓటరు దినోత్సవం

గన్‌ఫౌండ్రి: ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలని పోలింగ్‌ రోజున వేలికి బ్లూ ఇంక్‌ లేకుంటే.. వారంతా తమ నొసటన బ్లాక్‌మార్క్‌ వేసుకున్నట్లే అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘం, జీహెచ్‌ఎంసీ సంయుక్తంగా రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం తమిళిసై ప్రసంగిస్తూ.. ప్రజాస్వామ్యం కల్పించిన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలన్నా.

ఓటర్ల దినోత్సవాన్ని ప్రజాస్వామ్య దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీల కంటే ప్రజలే పవర్‌ఫుల్‌ అన్నారు. అభ్యర్ధుల గుణగణాలను బేరీజు వేసి ఓటు వేయాలని, సరైన వారెవరూ లేరనుకున్నప్పుడు నోటా ఉందంటూ.. అదే ప్రజాస్వామ్యం బ్యూటీ అని అభివర్ణించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రయోగాత్మకంగా కొంపల్లిలో నిర్వహించిన ఓటర్‌ ఫేషియల్‌ రికగ్నిషన్‌ విధానాన్ని ప్రశంసించారు.  కుల, మత, భాష, ప్రాంతం, వర్గాలకు అతీతంగా ఓటు వేస్తామని సభికులతో గవర్నర్‌ ప్రతిజ్ఞ చేయించారు.

అవార్డుల అందజేత...
ప్రభుత్వ నిర్మాణం, నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే ప్రజా స్వామ్య వ్యవస్థ మౌలిక సూత్రమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వి.నాగిరెడ్డి వివరించారు. రాష్ట్రంలో పార్లమెంట్, శాసన సభ, స్థానిక సంస్థల ఎన్నికలను రీపోలింగ్‌కు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సునీల్‌అరోరా సందేశం వీడియోక్లిప్‌ ప్రదర్శించారు. ఎన్నికల ప్రక్రియలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఇతర సిబ్బందికి, వ్యాసరచన, ఉపన్యాస పోటీల విజేతలకు రాష్ట్ర స్థాయి అవార్డులను గవర్నర్‌ అందజేశారు. రెగ్యులర్‌గా ఓటు వేస్తున్న సీనియర్‌ సిటిజన్లకు, ఓటర్‌గా నమోదు చేసుకున్న యువ ఓటర్లకు కొత్త ఫొటో ఓటరు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

అవార్డులకు ఎంపికైన జిల్లా కలెక్టర్లలో ఎంఆర్‌ఎం.రావు(నిజామాబాద్‌), ఎం.హనుమంతరావు (సంగారెడ్డి), రోనాల్డ్‌రాస్‌(మహబూబ్‌నగర్‌), మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా (వికారాబాద్‌), ఖమ్మం పోలీస్‌ కమిషనర్‌ తవుఫ్‌సీర్‌ ఇక్బాల్, వరంగల్‌ (అర్బన్‌) కమిషనర్‌ డా.వి.రవీందర్‌ తదితరులున్నారు. ఎం.హనుమంతరావు తరఫున ఆ జిల్లా డీఆర్‌ఓ రాధికా రమణి, రోనాల్డ్‌ రాస్‌ తరఫున ఏఓ. ప్రేమ్‌రాజ్, మస్రత్‌ ఖానమ్‌ ఆయేషా తరఫున డీటీడీఓ కాటాజి, కరీంనగర్‌ డీఆర్‌ఓ పి.ప్రావిణ్య తరఫున మార్కెటింగ్‌ ఏడీ వి.పద్మావతి, ‘సీఎస్‌ఓ–లెట్జ్‌ ఓట్‌’ నుంచి రాఘవేంద్ర, ఆల్‌ ఇండియా రేడియో నుంచి డా.రాహుల్‌ అవార్డులు అందుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top