వీడని సస్పెన్స్‌! | Sakshi
Sakshi News home page

వీడని సస్పెన్స్‌!

Published Thu, Sep 13 2018 12:21 PM

Suspense Vikarabad Constituency MLA Ticket - Sakshi

సాక్షి, వికారాబాద్‌: వికారాబాద్‌ నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఖరారుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. కొంతకాలంగా తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్‌ రాదనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యేకు చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టిన అధిష్టానం ఇప్పటికీ టికెట్‌ను ఎవరికీ ఖరారు చేయలేదు. దీంతో వికారాబాద్‌ నుంచి ఎవరు పోటీచేస్తారనే విషయంలో సందిగ్ధం వీడలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటిస్తారోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో గెలుపు గుర్రాలపై గులాబీ ప్రముఖులు దృష్టిసారించినట్లు సమాచారం.
  
నాకే ఇవ్వాలి... 
త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖంగుతిన్న తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మొదటి మూడు రోజుల పాటు స్తబ్దుగా ఉన్నారు. దీంతో ఆయనపై నాయకులు, కార్యకర్తల్లో సానుభూతి వ్యక్తమైంది. జాబితాలో పేరు లేనప్పటికీ ఇతరులకు టికెట్‌ కేటాయించకపోవడంతో ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని అనుచరులు, అభిమానులు పేర్కొనడంతో.. పార్టీలోని ప్రముఖులను కలుస్తూ తనకే అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. నాలుగు రోజులక్రితం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన మద్దతుదారులు, పార్టీ నేతలతో సమావేశమై అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు.

మరుసటి రోజునే సంజీవరావు తన మద్దతుదారులతో కలిసి టీఆర్‌ఎస్‌ అగ్రశ్రేణి నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి తదితరులను కలిసి విన్నవించారు. 
పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులంతా తన వెంటే ఉన్నారని, కార్యకర్తల అండదండలు కూడా తనకే ఉన్నాయని ఆయన చెప్పినట్లు సమాచారం. టికెట్‌ విషయంలో సంజీవరావుకు అధిష్టానం ఇప్పటికీ హామీ ఇవ్వలేదు. గెలుపు గుర్రాల కోసం గులాబీ పార్టీ అన్వేషణ తీవ్రతరం చేసినట్లు వినికిడి. టికెట్‌ ఎవరికి ఇవ్వాలనే విషయంలో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం.
 
ఆశావహుల ప్రయత్నాలు... 
వికారాబాద్‌ టీఆర్‌ఎస్‌ టికెట్‌ విషయంలో సస్పెన్స్, థ్రిల్లింగ్‌ కొనసాగుతుండగా ఆశావహులు తమతమ స్థాయిల్లో పైరవీలు ముమ్మరం చేశారు. దాదాపు ఏడుగురికి పైగానే ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. చేవెళ్ల టికెట్‌ కోసం పోటీపడి భంగపడిన మాజీ ఎమ్మెల్యే రత్నం పేరు కూడా పార్టీ తరఫున ప్రచారంలో ఉన్నప్పటికీ.. తాను టీఆర్‌ఎస్‌ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. మర్పల్లి మండలానికి చెందిన మదుగు రామేశ్వర్‌ పేరు సైతం వినిపిస్తోంది. ఈయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో పనిచేసిన రామేశ్వర్‌ 2002లో టీఆర్‌ఎస్‌లో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. టీఆర్‌ఎస్‌లో ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మర్పల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

ఈయన ఇటీవలే స్థానిక నేతలతో వెళ్లి ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సనగారి కొండల్‌రెడ్డిని కలిసి తనకు పోటీచేసే అవకాశం ఇస్తే ఎంతైనా సరే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం రామేశ్వర్‌ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం నాయకులు భూమనోళ్ల కృష్ణయ్య, స్థానిక వైద్యులు సబితాఆనంద్, విద్యాసాగర్, టి.ఆనంద్, టీచర్‌ దేవదాస్, కౌన్సిలర్‌ రమేష్‌ తదితరులు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు వేగవంతం చేశారు. కాగా పార్టీ టికెట్‌ ఎవరికి కేటాయించినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని, వికారాబాద్‌లో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ సనగారి కొండల్‌రెడ్డి పేర్కొంటున్నారు. అధిష్టానానికి ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలియజేశామని, ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశముందని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement