సాధికారతకు నిలువుటద్దం

Special Story About Womens Day In Adilabad District - Sakshi

బోథ్‌ మండలం బాబెర గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ ఆత్రం సుశీలబాయి ఇటీవల హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళసై నుంచి అవార్డు స్వీకరించారు. బోథ్‌ మండల సమైక్య అధ్యక్షురాలుగా ఉన్న సుశీలబాయి సామాజిక చైతన్యం కేటగిరిలో ఈ అవార్డును పొందారు. మహిళ స్వయం సంఘాల బలోపేతం, గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు, వినియోగంపై ప్రోత్సహించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆమెకు ఈ అవార్డును అందజేశారు.  

సాక్షి, ఆదిలాబాద్‌ : నేడు అంతర్జాతీయ మహిళ దినోత్సవం నేపథ్యంలో మహిళ సాధికారతకు నిలువుటద్దంగా పై అంశాలు నిలుస్తున్నాయి.. ఆయా రంగాల్లో మహిళలు నాయకత్వం వహిస్తూ ఇతరులకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. యువతులకు ఆదర్శప్రాయం అవుతున్నారు. జిల్లా పరిపాలన పరంగా ముఖ్యమైన హోదాల్లో మహిళ అధికారులు అధికంగా ఉండటం గమనార్హం. జిల్లా కలెక్టర్‌ శ్రీదేవసేనతో పాటు అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ అభిలాష అభినవ్‌లు ఉన్నత హోదాలో విశిష్టంగా సేవలు అందిస్తున్నారు. ఇక జిల్లా వ్యవసాయ అధికారిణిగా ఆశకుమారి, జిల్లా మహిళ సంక్షేమ అధికారిగా మిల్కా, భూగర్భ జలశాఖ అధికారిణిగా శ్రీవల్లి, ఐటీడీఏ డీడీ చందన వివిధ శాఖలను సమర్ధవంతంగా నిర్వహిస్తూ జిల్లాకు వన్నె తెస్తున్నారు. అదేవిధంగా మహిళ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లుగా రాజకీయంగానూ మహిళలు రాణిస్తున్నారు. 

ఫిబ్రవరి 3న ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన బాధ్యతలు స్వీకరించారు. అదే నెల 18న ముంబైలో సీఎంవో వరల్డ్‌ సంస్థ నుంచి వరల్డ్‌ ఉమెన్‌ లీడర్‌షిప్‌ అవార్డును అందుకున్నారు. పెద్దపెల్లి కలెక్టర్‌గా వ్యవహరించిన సమయంలో ఇంకుడు గుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మహిళలకు శానిటరీ న్యాప్కిన్స్‌ పంపిణీ, పల్లెప్రగతి, తదితర కార్యక్రమాల నిర్వహణ పకడ్బందీగా నిర్వహించినందుకు గాను ఈ అవార్డును అందజేయడం జరిగింది. పెద్దపెల్లి కలెక్టర్‌గా అభివృద్ధి, పారిశుధ్యం, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ వంటి అంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పురస్కారాలు దక్కాయి. ఆదిలాబాద్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి నెలరోజులు మాత్రమే అయినప్పటికి విధుల నిర్వహణలో తనదైన ముద్ర వేశారు. 

రాష్ట్రంలో ఇటీవల కాలంలో దిశ కేసుతో పాటు సమతా కేసు కూడా సంచలనం సృష్టించింది. సమతా కేసు విచారణ ఆదిలాబాద్‌ ప్రత్యేక కోర్టులో 66 రోజుల పాటు సాగింది. ప్రత్యేక కోర్టుకు జడ్జిగా ఎంజీ ప్రియదర్శిని వ్యవహరించారు. ఈ కేసులో దోషులకు మరణ శిక్ష విధించడం గమనార్హం. లోక్‌ అదాలత్‌ ద్వారా కేసుల పరిష్కారంలో రాష్ట్రంలో రెండుసార్లు వరుసగా మొదటి స్థానంలో నిలిచారు. మహిళ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ఆమె విస్తృతంగా కృషి చేస్తున్నారు.

స్త్రీలను గౌరవించడం ఇంటి నుంచే మొదలవ్వాలి
ప్రతి పురుషుడు మహిళను తల్లి, చెల్లి, కూతురులా భావించాలి. కనీస గౌరవం ఇవ్వాలి. ఇది మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆడ, మగ అనే తేడా లేకుండా ఆడపిల్లలకు సమానత్వం ఇవ్వాలి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. అంతరిక్షంలో కూడా ప్రయాణిస్తున్నప్పటికీ భూమిపై నడవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలపై అత్యాచారాలు, హింస ఘటనలు నివారించాలంటే ఓ మంచి సమాజ నిర్మాణం జరగాలి. అంతర్జాతీయ మహిళ దినోత్సవం ఎన్నో ఏళ్లుగా జరుపుకుంటున్నప్పటికీ మహిళలు తమ సాధికారతను ఇంకా పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి.
– శ్రీ దేవసేన, కలెక్టర్‌   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top