
ప్రొఫెసర్ బెదిరింపులతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ప్రొఫెసర్ ఫెయిల్ చేస్తానని బెదిరించడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వెంగళరావునగర్, న్యూస్‌లైన్: ప్రొఫెసర్ ఫెయిల్ చేస్తానని బెదిరించడంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విద్యార్థిని తల్లి జయ తెలిపిన వివరాల ప్రకారం... కూకట్‌పల్లిలో ఉండే జయ, దివాకర్‌ల కుమార్తె మంజరి ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలోని హాస్టల్‌లో ఉంటూ బ్యాచ్‌లర్ ఆఫ్ ఆయుర్వేద మెడిసన్ అండ్ సర్జరీ (బీఏఎంఎస్) ఫైనల్ ఇయర్ చదువుతోంది. తమ బంధువు మృతి చెందడంతో మంజరి ఇటీవల కళాశాలలో జరిగిన ప్రి-ఫైనల్ ఎగ్జామ్స్‌కు హాజరు కాలేదు.
దీంతో కళాశాలలోని శాలక్య డిపార్ట్‌మెంట్ హెడ్, ఎగ్జామ్స్ ఇన్‌ఛార్జి అయిన ప్రొఫెసర్ సూర్యప్రకాశ్ గత శుక్రవారం ఆ విద్యార్థినికి ఫోన్ చేశాడు. ఎందుకు పరీక్ష రాయలేదని ప్రశ్నించాడు. ఆమె చెప్తున్న సమాధానం వినకుండానే.. త్వరలో జరిగే ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వైవాలో ఫెయిల్ చేస్తానని, మిగతా ప్రొఫెసర్‌లకు కూడా చెప్పి మిగతా సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ చేయిస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళనకు గురైన మంజరి సూసైడ్ నోట్ రాసి ఇన్సులిన్ ఇంజక్షన్ చేసుకోవడంతో పాటుగా నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.
నర్స్‌గా పని చేస్తున్న తల్లి సాయంత్రం విధుల నుంచి తిరిగి వచ్చే సరికి కుమార్తె అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ఆమె కుమార్తెను మియాపూర్‌లోని ఆసుపత్రిలో చేర్పించింది. మంజరి ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతోంది. తన కుమార్తె మెరిట్ స్టూడెంట్ అని, ఇప్పుడు ఫెయిల్ చేస్తామంటే ఆమె భవిష్యత్ ఏం కావాలని మంజరి తల్లి ప్రశ్నించింది.
తన కుమార్తె ఆత్మహత్యాయత్నం చేయడానికి కారకుడైన ప్రొఫెసర్‌తో పాటు కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లుకు సైతం ఫోన్ చేయగా వారి నుంచి సరైన సమాధానం రాలేదన్నారు. శని, ఆదివారాల్లో సెలవు దినాలు కావడం వల్ల సోమవారం కళాశాలకు వచ్చినట్టు విద్యార్థిని తల్లి జయ తెలిపింది.
ఆందోళన...
మంజరి తల్లి సోమవారం ఆయుర్వేద కళాశాలకు వచ్చి ఆందోళనకు దిగింది. తోటి విద్యార్థినులతో కలిసి ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లును కలిశారు. తన కూతురు ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి కారణమైన ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు కళాశాలకు వచ్చి ఆందోళన చేస్తున్నవారిని శాంతింపజేశారు. ప్రొఫెసర్ సూర్యప్రకాశ్‌ను విచారణ నిమిత్తం పోలీసుస్టేషన్‌కు తరలించారు. జరిగిన ఘటనపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు విద్యార్థులకు తెలిపారు. సూర్యప్రకాశ్‌ను ఎగ్జామినేషన్ ఇన్‌చార్జి విధుల నుంచి తక్షణం తప్పిస్తున్నట్టు వెల్లడించారు.