నిధులున్నాయ్‌.. నిర్మాణాలే సాగవు

MRC works are not in the foregrounds of 96 zones - Sakshi

నాలుగేళ్లుగా 96 మండలాల్లో ముందుకు సాగని ఎంఆర్‌సీ పనులు

ఎస్‌ఎస్‌ఏలో భాగంగా రూ.30 కోట్లు విడుదల చేసిన కేంద్రం

ఇప్పటికీ పూర్తికాని నిర్మాణాలు, పైసా ఖర్చు చేయని వైనం  

సాక్షి, హైదరాబాద్‌: మండల వనరుల కేంద్రం (ఎంఆర్‌సీ) నిర్మాణ పనులకు గ్రహణం పట్టింది. భవనాలకు స్థలాలు, నిధులు విడుదల చేసినప్పటికీ వాటిని నిర్మించడంలో యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో నాలుగేళ్లుగా వాటి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. సర్వశిక్షా అభియాన్‌ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో 96 మండలాలకు ఎంఆర్‌సీ భవనాలు మంజూరు చేసింది. ఒక్కో భవనాన్ని రూ.30 లక్షల వ్యయంతో నిర్మించాలని ఆదేశించింది. మండల వనరుల కేంద్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మండల స్థాయి సమావేశాలు, విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఈ క్రమంలో విద్యాశాఖకు కీలకంగా ఉపయోగపడనున్నాయని భావించిన ప్రభుత్వం 96 ఎంఆర్‌సీలను మంజూరు చేసింది. ఇందుకు రూ.30 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ క్రమంలో టెండర్లు పిలిచిన అధికారులు కాంట్రాక్టర్లను ఎంపిక చేసి నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇవి మంజూరైనప్పటికీ నిర్మాణ పనులు పునాదులు దాటలేదు. ఎంఆర్‌సీ నిర్మాణాలను గరిష్టంగా ఏడాది లోపు నిర్మించాలి. ఈమేరకు కాంట్రాక్టర్లకు నిబంధనలు విధించాయి. కానీ కాంట్రాక్టర్లు నిర్మాణ బాధ్యతలు తీసుకుని ఏడాది దాటినా వాటిని పూర్తి చేయలేదు. నిబంధనలు పాటించని క్రమంలో కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆ దిశగా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. 

కొత్తవి జాడేలేదు... 
సర్వశిక్షా అభియాన్‌ స్థానంలో కొత్తగా సమగ్ర శిక్షా అభియాన్‌ ఏర్పాటైంది. ఈక్రమంలో గత రికార్డులను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం, వాటి పురోగతి ఆధారంగా కొత్త నిర్మాణాలను ఆమోదిస్తోంది. ఈక్రమంలో నాలుగేళ్లనాటి పనులే పూర్తికాకపోవడంతో రాష్ట్రానికి కొత్తగా ఎంఆర్‌సీలను మంజూరు చేయలేదు. వాస్తవానికి కొత్త మండలాలతో కలుపుకుని రాష్ట్రంలో దాదాపు 2వందల ఎంఆర్‌సీలు అవసరముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో కొత్తవాటికి ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని మంజూరు చేయలేదు. దీంతో ఇప్పటికే మంజూరైన వాటిని త్వరగా పూర్తి చేయాలని నిర్ణయించిన అధికారులు కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top