నక్సలైట్లమా.. దేశద్రోహులమా?

Manda Krishna Madiga Fires Over The Arrests Regarding RTC Strike  - Sakshi

మృతుడి కుటుంబాన్ని పరామర్శించడం తప్పా 

ఆర్టీసీ కార్మికుల మరణాలు ప్రభుత్వ హత్యలే 

ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

చన్గోముల్‌ పీఎస్‌ వద్ద పలువురు నేతల అరెస్ట్‌

సాక్షి, పూడూరు: ‘గుండెపోటుతో మరణించిన ఆర్టీసీ కార్మికుడు వీరభద్రప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లడం తప్పా.. మేమేమైనా నక్సలైట్లమా.. దేశద్రోహులమా..? ఇలా రోడ్లపై అరెస్టులు చేయడం ఏమిటి’ అని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలిపిందుకు హైదరాబాద్‌ నుంచి పరిగి వెళ్తున్న వీరిని చన్గోముల్‌ పీఎస్‌ ఎదుట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్టేషన్‌లో నిర్బంధించారు.

ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ.. కేసీఆర్‌ నియంతృత్వ పోకడవల్లే ఆర్టీసీ కార్మికుల బలిదానాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. భేషరతుగా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో దేవుళ్లుగా కనిపించిన ఆర్టీసీ కార్మికులు.. ఇప్పుడు దెయ్యాలయ్యారా అని ప్రశ్నించారు. సంస్థ ఆస్తులను కొల్లగొట్టేందుకు పెద్దఎత్తున కుట్ర సాగుతోందని ఆరోపించారు. ఆర్టీసీ కారణంగా 82 ఏళ్ల చరిత్రలో పడని భారం ఇప్పుడే పడుతోందా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు సురేందర్, ఆర్టీఐ మండల కన్వీనర్‌ వెంకటయ్య, యువజన నాయకులు సల్మాన్‌ఖాన్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, హమ్మద్, శ్రీనివాస్, అజీంపటేల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top