జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్ | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్

Published Tue, Jun 23 2015 1:09 AM

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: కేటీఆర్ - Sakshi

సాక్షి, హైదరాబాద్: జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు సోమవారం సచివాలయంలో మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. అర్హులైన వారికి వెంటనే అక్రెడిటేషన్లు మంజూరు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్యబీమా వర్తింపచేయాలని, జస్టిస్ గురుభక్ష్ నివేదిక ప్రకారం వేతన సవరణ, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలనే డిమాండ్లను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

స్పందించిన కేటీఆర్ అధికారులతో తన ఛాంబర్‌లో సమావేశమై జర్నలిస్టుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు. అక్రెడిటేషన్‌లకు సంబంధించి ఈ నెల 24న ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అధ్యక్షతన కమిటీ సమావేశమవుతుందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా అక్రెడిటేషన్ల కమిటీలు కూడా ఏర్పాటుచేస్తామన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యబీమా కార్డులు జారీ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా.కెవీ రమాణాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌరసంబంధాల కమిషనర్ బీపీ ఆచార్య, వైద్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌చంద, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌మిశ్రా, రాష్ట్ర సమాచారశాఖ డెరైక్టర్ వి.సుభాష్ లతో పాటు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement