10% అమలుకు 25% సీట్లు పెంచాల్సిందే!

It is not Enough to Increase 10% of Seats to Implement EWS Signs - Sakshi

మెడికల్‌ పీజీ సీట్లలో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమల్లో సమస్యలు 

కసరత్తు చేస్తున్న కాళోజీ

నారాయణరావు హెల్త్‌ వర్సిటీ

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌) విద్యార్థుల కోసం పీజీ వైద్యవిద్య సీట్లలో 10% సీట్లను కేటాయిస్తూ భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) తీసుకున్న నిర్ణయం అమలు చేయాలంటే 25% సీట్లను పెంచాల్సి ఉంటుందని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న పీజీ సీట్లకు అదనంగా 10% సీట్లను పెంచాలని ఎంసీఐ చెప్పినా ఆచరణలో 25% పెంచాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఈ పెంపు వర్తింపజేయాల్సి ఉంటుందని ఎంసీఐ స్పష్టం చేసింది. ఓసీల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని పరిగణనలోకి తీసుకొని రాష్ట్రంలోనూ అందుకు అనుగుణంగా బిల్లు తీసుకురావాల్సి ఉం టుందని వర్సిటీ వర్గాలంటున్నాయి. ఈడబ్ల్యూఎస్‌  అమలు అంత సులువైన వ్యవహారం కాదని, అనేక రకాల సమస్యలున్నాయని పేర్కొంటున్నాయి. 

సుప్రీంకోర్టు చెప్పినట్లుగా.. 
రాష్ట్రంలో ప్రస్తుతం 706 పీజీ స్పెషాలిటీ వైద్య సీట్లు ఉన్నాయి. వాటిని 10% వరకు పెంచాలంటే 71 సీట్లు పెంచాల్సి ఉంటుందని మాత్రమే అందరూ అనుకుంటారు. కానీ 25% పెంచాల్సి ఉంటుందని ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం సీట్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లలో ఏమాత్రం తేడా రాకూడదు. అంటే ఆ పెరిగిన 71 సీట్లలోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలవుతాయి. ఆ ప్రకారం ఇక్కడ 10% సీట్లను పెంచితే సరిపోదు. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు అమలవుతూనే.. ఈ 10% రిజర్వేషన్‌ను అమలుచేయాలంటే మొత్తంగా 25% సీట్లను పెంచాల్సి ఉంటుంది. ఆ ప్రకారం 706 పీజీ వైద్య సీట్లకు అదనంగా మరో 25% అంటే 176 సీట్లు పెంచాల్సి ఉంటుందని వర్సిటీ వర్గాలంటున్నాయి. అలాగైతే తెలంగాణలో మొత్తం మెడికల్‌ పీజీ సీట్లు 882కు చేరతాయి.

ఈ పెంపునకు అనుగుణంగా.. పెరగనున్న సీట్లకు తగ్గట్లుగా వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది, శిక్షణ, ఆసుపత్రుల్లో పడకలు, తదితర మౌలిక సదుపాయాలను కల్పించుకోవాలని కోరుతూ అన్ని రాష్ట్రాల వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శులకు ఎంసీఐ లేఖ రాసింది. ఇక ఎంబీబీఎస్‌ సీట్లల్లోనూ ఇలాగే 10% ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలంటే అక్కడా 25% సీట్లను పెంచాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో ప్రస్తుతమున్న 1,150 ఎంబీబీఎస్‌ సీట్లసంఖ్యకు అదనంగా మరో 287 సీట్లు పెంచాల్సి ఉంటుంది. ఈ సీట్లను పెంచాలంటే మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల సంఖ్యను పెంచుకోవాలి. 

అసెంబ్లీలో బిల్లు రావాలి 
ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను అమలుచేసేందుకు 10% శాతం సీట్లను పెంచితే సరిపోదు. ఆ పెంచిన లెక్క ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి. అంటే మొత్తంగా 25% సీట్ల పెంపు జరిగితేనే ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను సమానంగా అమలు చేయగలం. ఆ ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించాలి. అధ్యాపకుల సంఖ్యను పెంచుకోవాలి. రాష్ట్ర అసెంబ్లీలోనూ అందుకు అనుగుణంగా బిల్లు పాస్‌ కావాలి. 


డాక్టర్‌ కరుణాకర్‌ రెడ్డి, వీసీ, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top