
సాక్షి, వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పిదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. తాజాగా వరంగల్ రూరల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం నెక్కొండ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి తనువు చాలించారు. మృతున్ని నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్‌గా గుర్తించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో నవీన్ ఆత్మహత్యకు పాల్పడట్టుగా తెలుస్తోంది. ఫలితాల్లో అవకతవకల కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఇంటర్ బోర్డు తప్పిదాలు కళ్లేదుట కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్ రీ వాల్యువేషన్‌పై ఇంటర్ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపాల్సిన చర్యలు కానరాకపోవడం బాధకరం.