నేటి నుంచి నౌకలు, విమానాల్లో భారతీయుల తరలింపు

Indians move on ships and planes from 7th May says Kishan Reddy - Sakshi

గల్ఫ్‌ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద తరలింపు: కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని ప్రాధాన్య క్రమంలో రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద తరలింపు కార్యక్రమాన్ని చేపట్టనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. మే 7 నుంచి విమానాలు, నౌ కల ద్వారా విదేశాల నుంచి భారతీయులను తరలించే కార్యక్రమం మొదలవుతుందన్నారు. ఇప్పటికే 1.90 లక్షల మంది భారతీయులు ఇండియాకు వచ్చేందుకు వివిధ దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో, హైకమిషనర్‌ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకున్నారన్నారు. మొదటి దశలో 13 దేశాల నుంచి 14,800 మంది భారతీయులను 64 విమానాల్లో భారత్‌కు తీసుకురానున్నట్లు చెప్పారు.

అమెరికా, సింగపూర్, ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, యూకే, యూఏఈ, సౌదీ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్‌ దేశాల నుంచి అక్కడున్న భారతీయులను తీసుకువస్తామన్నారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఒక్కో విమానంలో 200 నుంచి 300 మందిని తరలిస్తారన్నారు. ఆయా దేశాల నుంచి వెలివేయబడిన వారు, వీసా గడువు ముగిసిన వారు, వలస కార్మికులు, ఆరోగ్యరీత్యా భారత్‌లోని ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అవసరమైన వారు, గర్భిణిలు, భారత్‌లో చనిపోయిన వారి బంధువులు, ఆయా దేశాల్లో చిక్కుకున్న పర్యాటకులు, విదేశాల్లో హాస్టళ్లు మూతబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను అదే ప్రాధాన్య క్రమంలో తీసుకువస్తామన్నారు. మొదటి గల్ఫ్‌ యుద్ధం తర్వాత మళ్లీ ఇదే అతి పెద్ద తరలింపు కార్యక్రమమని చెప్పారు. భారత్‌కు రావాలనుకున్న వారు కరోనా పరీక్షలు పూర్తయి సర్టిఫికెట్‌ పొంది ఉండాలని, భారత్‌ వచ్చాక మళ్లీ పరీక్షల అనంతరం క్వారంటైన్‌కు వెళ్లాలన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top