ఉపాధి హామీతో రైతుల ఆదాయం పెంపు

Increase farmers' income with employment guarantee scheme - Sakshi

నీతి ఆయోగ్‌ సమావేశంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి అమర్‌జిత్‌

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని కేంద్ర గ్రామీణాభివృ ద్ధిశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘2022 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు’ లక్ష్యంతో వ్యవసాయం, ఉపాధి హామీ అనుసంధానం విధానాన్ని రూపొందించే అంశంపై ‘నీతి ఆయోగ్, రాష్ట్ర వ్యవసాయశాఖ’ సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్రాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెరిగినట్లు గుర్తించామన్నారు. పంటల సాగు ఖర్చును తగ్గించటం, మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యం, గిడ్డంగుల నిర్మాణం ద్వారా వారి ఆదాయం పెంపొందించవచ్చని తెలిపారు. ఇన్‌పుట్‌ ఖర్చులు తగ్గించడం వలన మేలైన ఫలితాలు లభిస్తాయని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రైతులకు అవసరమైన ఆస్తుల కల్పనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు.

కూలీల వేతనాలు స్థిరంగా ఉన్నాయి కానీ, వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులు గణనీయం గా పెరిగినట్లు సర్వేలు తెలుపుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పు లు చేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలలో సమర్థవంతంగా అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. రైతుల ఆదాయం పెంపొందించడానికి ప్రకృతి వనరుల యాజమాన్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన రుణ సదుపాయం, పరిశోధన, మార్కెటింగ్‌ వ్యూహాలు తదితర తొమ్మిది అంశాలపై దృష్టి పెట్టాలన్నారు.

98% చిన్న, సన్నకారు రైతులు: సీఎస్‌
రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపొందించడానికి అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె.జోషి వివరించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడికోసం రైతుబంధు పథకం ప్రారంభించామని, సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి రూ.5 లక్షల ఉచిత బీమాను ప్రతి రైతుకు అందిస్తున్నామన్నారు. భూసర్వే ద్వారా తెలంగాణలో 98 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడానికి, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.

హరితహారం పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నందున ఉపాధి హామీలో వేతనం కింద అధిక నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇన్‌పుట్‌ ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంపొందించినప్పుడే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నా రు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసార థి స్వాగతోపన్యాసం చేస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలను వివిధ వర్గాల నుండి తీసుకోవడానికి ఈ వర్క్‌షాప్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తగు సూచనలు అందించాలని ఆయన కోరారు.

ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌ కుమా ర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి దేవేశ్‌ చతుర్వేది, నీతి ఆయోగ్‌ సలహాదారు ఎ.కె.జైన్, ఎన్‌.ఐ.ఆర్‌.డి డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ డబ్లు్య ఆర్‌ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌ రాజ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పాండిచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ ప్రాంతాల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, నీతి ఆయోగ్‌ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు, ఎన్జీవోలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top