నగరం రంజాన్‌కు సిద్ధం

Hyderabad Ready For Ramadan Festival - Sakshi

కొత్త జానీమాజ్‌లకు డిమాండ్‌ 

నగరంలో అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌

విదేశీ వెరైటీలన్నీ ఒకే చోట లభ్యం

సాక్షి,సిటీబ్యూరో: పవిత్ర రంజాన్‌ మాసం కోసం నగరం ముస్తాబవుతోంది. ముస్లింలు ఉపవాస ఆరాధనలకు సిద్ధమవుతున్నారు. ఈ మాసంలో ఉపవాసాలు పాటిçస్తూ దైవారాధనల్లో ఎక్కువ సమయం గడుపుతారు. మసీదుల్లో ఐదుపూటలా నమాజ్‌లతో పాటు ఇళ్లలో రాత్రింబవళ్లు ప్రత్యేక ప్రార్థనలు సైతం చేస్తారు. అయితే ఈ ప్రార్థనల కోసం ‘జానీమాజ్‌’లను తప్పక వినియోగిస్తారు. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో పవిత్ర మాసం ప్రారంభం కానున్న దృష్ట్యా నగరంలో జానీమాజ్‌ల అమ్మకాలు జోరందుకున్నాయి. అందుకు అనుగుణంగా పాతబస్తీ మదీనా సర్కిల్‌లోని ముహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌లో ‘అంతర్జాతీయ జానీమాజ్‌ ఎగ్జిబిషన్‌’ ఏర్పాటు చేశారు. 

జానీమాజ్‌ అంటే..
ఇస్లాంలో నమాజ్‌ ఆరాధనలు చేసేటప్పుడు ఆరు నిబంధలను పాటించాలి. వాటిలో మొదటిది ఎక్కడైతే నమాజ్‌ చేస్తున్నారో అ ప్రదేశం శుభ్రంగా ఉండాలి. నమాజ్‌ చేయడానికి అనువైన ప్రదేశాన్ని ‘జామే’ అంటారు. నమాజ్‌ చేసేందుకు వినియోగించేవస్త్రాన్ని జానీమాజ్‌ అంటారు. 

ఊపందుకున్న విక్రయాలు
రంజాన్‌ నెల ప్రారంభానికి తక్కువ సమయమే ఉండడంతో ఇళ్లు, మసీదుల్లో వినియోగించేందుకు ముస్లింలు జానీమాజ్‌లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఈ మాసంలో ఆయా ప్రదేశాల్లో ముస్లింలు జానీమాజ్‌లపై కూర్చని ఖురాన్‌ చదవడంతో పాటు అన్ని రకాల ప్రార్థనలు చేస్తారు. దీనికోసం సౌకర్యంగా ఉండే (కార్పెట్‌ తరహా) వాటినే కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోపక్క కొందరు ముస్లింలు తమ తల్లిదండ్రులు, పూర్వికుల పేరు మీద జానీమాజ్‌లను కొనుగోలు చేసి వారి పేరుపై మసీదుల్లో దానం చేస్తున్నారు.

ఇక్కడ అన్ని దేశాల వెరైటీలు లభ్యం
ప్రపంచ దేశాల్లో తయారు చేసే జానీమాజ్‌లు ఇక్కడ అందుబాటులో ఉంచారు. సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్, మలేసియా, ఇండోనేసియా, బెల్జియం దేశాల్లో తయారైన జానీమాజ్‌లతో పాటు కశ్మీర్‌లో చేతితో తయారు చేసే జానీమాజ్‌లను కూడా ఈ ప్రదర్శనలో ఉంచా రు. అయితే, సౌదీలో తయారైన వాటికి అధిక డిమాండ్‌ ఉంది. మినార్, కన్ని, సాదా, మెరాబ్‌ తదిరత డిజైన్లు ఇందులో ఉన్నాయి.  

ఈ ఏడాది రాయితీ ధరలు
ఈ ఎడాది రంజాన్‌కు అన్ని రకాల జానీమాజ్‌లను అందుబాటులో ఉంచాం. ఇంట్లో వినియోగించేందుకు వీలుగా మీటర్‌ పొడవు నుంచి మసీదులు, బహిరంగ ప్రదేశాల్లో సామూహిక ప్రార్థలనలు నిర్వహించేందుకు అనువుగా పొడవైన రోల్స్‌ జానీమాజ్‌లు సైతం ప్రదర్శనలో ఉన్నాయి. వీటిలో చేనేత, అధునాతన వీవింగ్‌ సిల్క్, నైలాన్, పాలిస్టర్, ఊలుతో నేసినవి కూడా ఉన్నాయి. పండగను పురస్కరించుకుని ఈసారి రాయితీ ధరల్లో అందిస్తున్నాం.   – ఇల్యాస్‌ బుఖారీ, మహ్మద్‌ క్యాప్‌ మార్ట్‌ యజమాని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top