జంక్షన్‌లో జంప్‌! | Hyderabad City Autos Signal Jumps | Sakshi
Sakshi News home page

జంక్షన్‌లో జంప్‌!

Aug 8 2018 11:43 AM | Updated on Sep 4 2018 5:53 PM

Hyderabad City Autos Signal Jumps - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆటోలు యమవేగంతో నడుపుతూ.. ట్రాఫిక్‌ జంక్షన్‌లలో సిగ్నల్స్‌ జంప్‌ చేస్తూ.. ఇతర వాహనదారుల ప్రాణాలకు ముప్పువాటిల్లేలా వ్యవహరిస్తున్న ఆటోవాలాలపై సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు దృష్టి సారించారు. ప్రధానమైన రోడ్లు, జంక్షన్‌లలో ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తున్నారని, డ్రైవింగ్‌తో భయపెడుతన్నారంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు భారీగా వస్తుండటంతో వివిధ ప్రాంతాల్లో ‘ఆటోల స్పెషల్‌ డ్రైవ్‌’ నిర్వహిస్తున్నారు. ఒక్క జూలై నెలలోనే ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమించిన ఆటోవాలాలపై మాదాపూర్‌లో 1018, గచ్చిబౌలిలో 757,  కూకట్‌పల్లిలో 637, మియాపూర్‌లో 497, బాలానగర్‌లో 444 కేసులు నమోదు చేశారు. ఎక్కువగా ప్రమాదకరంగా వాహనాలను నడపడం, ఆటోల్లో ఓవర్‌ లోడ్‌ను తరలించడం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పైలటింగ్, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్, నంబర్‌ ప్లేట్‌ ట్యాంపరింగ్‌ తదితర కేసులు నమోదు చేశారు. వారికి జరిమానా విధించడంతో రోడ్డుపై ఆటోలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ట్రాఫిక్‌ నిబంధనలపై వివరిస్తున్నారు. 

ఆ నాలుగు రూట్లలో స్పెషల్‌ డ్రైవ్‌..  
ట్రాఫిక్‌ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ఆటోడ్రైవర్లపై కొరడా ఝళిపించేందుకు బీహెచ్‌ఈఎల్‌– ఆల్విన్‌ జంక్షన్, కూకట్‌పల్లి, ఆల్విన్‌ జంక్షన్‌ –కొత్తగూడ– బొటానికల్‌– గచ్చిబౌలి, జేఎన్‌టీయూ– సైబర్‌ టవర్స్‌ – రహేజా మైండ్‌ స్పేస్‌– బయో డైవర్సిటీ జంక్షన్‌లతో పాటు బాలానగర్‌లో ఆటోలపై స్పెషల్‌ డ్రైవ్‌  నిర్వహిస్తున్నామని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల నుంచే ఎక్కువగా ఫిర్యాదులు వస్తుండటంతో జూలై నెలలో డ్రైవ్‌ నిర్వహించి 3,353 మంది ఆటోవాలాలపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు తెలిసినా తొందరగా వెళ్లాలన్న ఆతృతను ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌  ఉల్లంఘనలపై 8500411111 ఫోన్‌ లేదా వాట్సప్‌ చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement