భార్యపై భర్త వేధింపులు

Husband Harassing Wife In Warangal - Sakshi

ఏడాదిగా చిత్రహింసలు పెడుతున్న వైనం

తండ్రికి బాసటగా కుమారుడు, చిన్న కుమార్తె

న్యాయం చేయాలంటూ ఇంటి ఎదుట నిరసన తెలిపిన మహిళ

వరంగల్‌ : ఆస్తి కోసం కట్టుకున్న వాడితో పాటు.. కన్న పిల్లలు ఏడాదిగా చిత్ర హింసలు పెడుతూ వేధిస్తున్నారు.. చివరకు వారి వేధింపులు భరించలేక న్యాయం చేయాలంటూ ఓ మహిళ ఇంటి ఎదుట నిరసన తెలిపిన సంఘటన నగరంలోని కాశిబుగ్గలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్‌ మార్కెట్‌లో అడ్తి వ్యాపారం చేస్తున్న భూతం లక్ష్మీనారాయణ, రమాదేవిలు ఓ సిటీలో కాపురం ఉంటున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. గత ఏడాది కాలంగా రమాదేవిని ఆస్తికోసం భర్త లక్ష్మినారాయణ, కొడుకు అనిల్, చిన్న కూతురు మధులత ముగ్గురు కలసి ఆమెను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఆరునెలల క్రితం భర్త కర్రతో చితకబాదడంతో చేతి వేళ్లు పూర్తిగా వంకరయ్యాయి.

కాశిబుగ్గ 13వ డివిజన్‌లోని బాపూజీ కాలనీలో తన సొంత ఇంటిలో అద్దెకు ఉంటున్న పెద్ద కూతురుకు సమాచారం అందించారు. ఆమె వెంటనే వచ్చి తల్లిని తీసుకుపోవడంతో పాటు మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమెకు ఎవరు బాసటగా లేకపోవడం వల్ల అక్కడ సైతం న్యాయం జరగలేదు. ఇంతలోనే భర్త తనకు విడాకుల నోటీసు పంపించినట్లు తెలిపింది. రెండుసార్లు కోర్టుకు తాను హాజరైనప్పటికీ భర్త లక్ష్మినారాయణ రాలేదని చెప్పింది. పెద్ద కూతురు దగ్గర ఉంటున్నప్పటికీ తరచుగా వస్తూ భౌతిక దాడులకు పాల్పడుతుండడంతో భరించలేక ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా నేటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇంటి ఎదుట నిరసన..

కాశిబుగ్గలోని బాపూజీకాలనీలో ఉన్న ఇంటి ఎదుట రమాదేవి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఇళ్లు తన పేరు పైనే ఉందని చెప్పారు. 

కిరాయికి ఇచ్చినా..

అద్దెకు ఇల్లు ఇచ్చినా తీసుకోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయమని ఇంతేజార్‌గంజ్‌ ఎస్సై శ్రీని వాస్‌ని కలిస్తే ఎందుకమ్మ వేరే ఇంట్లో కిరాయికి ఉండమని సలహా ఇచ్చార తెలిపారు. రెడ్డిపాలెంలోని ఐదెకరాల భూ మి అమ్మితే వచ్చిన రూ.2కోట్ల నగదు వారి వద్దనే ఉందని తెలిపారు. తన కొడుకు 15 ఏళ్లుగా అమ్మా అని పిలవడం లేదని కన్నీరు మున్నీరయ్యారు. తాను పెద్దబిడ్డ వద్ద ఉంటున్నందున తన పేర ఉన్న ఆస్తిని వారి పేరు మీదకు మార్చుకోవాలని చూస్తున్నారని చెప్పారు. ఆస్తి విషయంలో తనను వారు హత్య చేసేందుకు సైతం వెనుకంజ వేయరని రమాదేవి తెలిపారు. తనకు, తన పెద్ద కూతురుకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top