పెద్దలు.. పిల్లలు!

Elders And Minors Arrested in Drunk And Drive Test Hyderabad - Sakshi

డ్రంకన్‌ డ్రైవ్‌లలో పట్టుబడుతున్న వయోధికులు.. మైనర్లు

70 ఏళ్ల వారు సైతం...

గత రెండు నెలల్లో చిక్కింది 14 మంది వృద్ధులు, ఆరుగురు మైనర్లు

సాక్షి, సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కుతున్న వారిలో వయో వృద్ధులు, మైనర్లు కూడా ఉంటున్నారు. గతంతో పోలిస్తే వీరి సంఖ్య నెలనెలకు పెరుగుతుండటం ట్రాఫిక్‌ పోలీసులను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌పరిధిలో నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కిన 4,145 మందిలో 14 మంది వయోవృద్ధులు, ఆరుగురు మైనర్లు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే వీరి సంఖ్య కాస్తా తక్కువగానే ఉన్నా ఈ వయసులో వీరు మద్యం సేవించి వాహనాలు నడపడాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కౌన్సెలింగ్‌ చేయడంతో పాటు జైలుశిక్షలు పడేలా చేసేందుకు న్యాయస్థానంలో చార్జిషీట్‌లు పకడ్బందీగా దాఖలు చేసి తదనుగుణంగా చర్యలు ఉండేలా చూసుకుంటున్నారు. 

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారితో ట్రాఫిక్‌ పోలీసులు
మాదాపూర్‌ టాప్‌...కూకట్‌పల్లి సెకండ్‌
55 రోజుల్లో 4,145 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కేసులు నమోదుచేశారు. వయసుల వారీగా చూసుకుంటే అత్యధికంగా 21 నుంచి 30 ఏళ్ల మధ్యవయసు వారే 2,053 మంది, ఆ తర్వాత 1,364 కేసులతో 31 నుంచి 40 ఏళ్ల వయస్సువారు, 41 నుంచి 50 ఏళ్ల వారు 487 మంది, 51 నుంచి 60 ఏళ్ల వారు 122 మంది, 18 నుంచి 20 ఏళ్ల వారు 99 మంది, 61 నుంచి 70 ఏళ్ల వారు 14 మంది ఉంటే ఆరుగురు మైనర్లు ఉన్నారు. బ్లడ్‌ ఆల్కాహలిక్‌ కౌంట్‌(బీఏసీ) 31 నుంచి 600 వరకు బ్రీత్‌ అనలైజర్‌ పరీక్షల ద్వారా తేలింది. మాదాపూర్, అల్వాల్, కూకట్‌పల్లి, శంషాబాద్‌లో అత్యధికంగా బీఏసీ స్థాయి 100 ఎంఎల్‌కు 550 ఎంజీగా నమోదైంది. అయితే ట్రాఫిక్‌ ఠాణాల వారీగా డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు చూస్తే అత్యధికంగా మాదాపూర్‌లో  981, కూకట్‌పల్లిలో 683 కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం 4,145 డ్రంకన్‌ డ్రైవ్‌ కేసుల్లో 662 మందికి మూడు నుంచి 30 రోజుల పాటు జైలు శిక్ష పడిందని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ బుధవారం తెలిపారు. అలాగే 790 మంది డ్రంకన్‌ డ్రైవర్ల డ్రైవింగ్‌ లైసెన్స్‌లు రద్దు చేయాలని ఆర్టీఏ అధికారులకు లేఖలు రాశామని చెప్పారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top