గమ్మత్తు | Danger Yam .. actual .. | Sakshi
Sakshi News home page

గమ్మత్తు

Jun 24 2014 3:05 AM | Updated on Sep 2 2017 9:16 AM

గమ్మత్తు

గమ్మత్తు

వైట్నర్ (ఇంక్ ఎరేజర్) మత్తుకు అలవాటు పడుతున్న చిన్నారులు తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాల్జేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో వైట్నర్‌ను తీసుకుంటున్న పిల్లలు మత్తులో...

  •       యమ డేంజర్.. వైట్నర్..
  •      మత్తులో చిత్తవుతున్న బాల్యం
  •      తెల్లవారిందంటే చేతిలో ఉండాల్సిందే
  •      డబ్బుల కోసం చోరీల వైపు
  •      దాడులకూ తెగబడుతున్న చిన్నారులు
  •      చోద్యం చూస్తున్న యంత్రాంగం
  • సాక్షి, సిటీబ్యూరో:  వైట్నర్ (ఇంక్ ఎరేజర్) మత్తుకు అలవాటు పడుతున్న చిన్నారులు తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాల్జేసుకుంటున్నారు. తెలిసీ తెలియని వయసులో వైట్నర్‌ను తీసుకుంటున్న పిల్లలు మత్తులో తేలిపోతున్నారు. దాన్ని పీల్చడం ద్వారా వచ్చే మత్తును ఆస్వాదిస్తారు. ఆ సమయంలో ఎంతో బలం, ధైర్యం వచ్చినట్టు భావిస్తారు.

    ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిన్నారులు ఏం ఆలోచిస్తున్నారు?, ఎలా వ్యవహరిస్తున్నారో వారికే తెలియని పరిస్థితి. వీరంతా ఆర్థికంగా వెనకబడిన పిల్లలే కావడం గమనార్హం. వైట్నర్‌ను కొనుగోలు చేయడానికి, ఇతరత్రా వాటికి డబ్బులు అవసరమున్నందున తరచూ చోరీలకు పాల్పడుతున్నారు. మరికొందరు భిక్షాటనకు అలవాటు పడుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఆదివారం ఓ బాలుడు వైట్నర్ మత్తులో డీఆర్‌డీఓ రీజనల్ డెరైక్టర్‌పై దాడికి దిగాడు. యాక్సా బ్లేడ్‌తో కడుపులో బలంగా గుచ్చడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు.
     
    ఉదయం లేచింది మొదలు..

    ఇలాంటి పిల్లలు ఉదయం లేచింది మొదలు వైట్నర్ కోసం ఎదురు చూస్తారు. ఎక్కడ ఉన్నా కొనుగోలు చేసి మరీ ఆ మత్తును అందుకుంటున్నారు. ఇలాంటి వారి సంఖ్య పాత బస్తీలో ఈ మధ్య కాలం పెరిగిపోయింది. చదువుకోవాల్సిన వయస్సులో ఈ వ్యవసనం బారిన పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు.
     
    కన్నెత్తి చూడని పోలీసులు...
     
    పోలీసులకు డ్రగ్స్ అనగానే కొకైన్, ఎపిడ్రిన్, గంజాయి, బ్రౌన్‌షుగరే గుర్తుకొస్తుంది. అయితే కళ్లముందు విచ్ఛలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న వైట్నర్లపై మాత్రం దృష్టి సారించడంలేదు. దీంతో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. పుట్‌పాత్‌లపై పిల్లలు వైట్నర్‌ను నిర్భయంగా తీసుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు.
     
    మాఫియా హస్తం?

    వైట్నర్ అమ్మకాల వెనుక పెద్ద మాఫియానే ఉంది. కొందరు వ్యాపారులు వీటిని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. బాలలను కిడ్నాప్ చేస్తున్న మాఫియా ముఠాలు వారికి వైట్నర్ అలవాటు చేస్తున్నట్టు సమాచారం. వైట్నర్ బారిన పడిన చిన్నారులు వారు ఏది చెబితే అది చేస్తున్నట్టు తెలుస్తోంది. భిక్షాటన, చోరీలు, నేరాలు సైతం సదరు ముఠాలు చేయిస్తున్నట్టు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ మాదిరిగా పనిచేసే ఈ పదార్థానికి ఒకసారి అలవాటు పడితే మానుకోవడం చాలాకష్టం.
     
    ఈ మత్తును తీసుకోనిదే సదరు పిల్లలు ఏ పని చేయలేదు. పూర్తిగా వైట్నర్‌కు బానిసలుగా మారి డబ్బు కోసం చోరీలకు పాల్పడుతున్నారు. ఒకవేళ వీరు పోలీసులకు చిక్కినా వారి ఇంటరాగేషన్‌లో దెబ్బలను తట్టుకునేందుకు కూడా ఈ వైట్నర్ దోహదపడుతుందని తెలిసింది. ఎంత కొట్టినా వారికి ఎలాంటి నొప్పి అనిపించక పోవడంతో పోలీసులంటే భయం కూడా పోయినట్టు తెలుస్తోంది.
     
    పర్యాటక ప్రాంతాల్లో అధికం..
     
    నగరంలోని పలు పర్యాటక ప్రాంతాల వద్ద రోజూ భిక్షాటన చేస్తున్న చిన్నారులు బహిరంగగానే వైట్నర్ తీసుకుంటున్నారు. తమ కళ్ల ముందే వైట్నర్ తీసుకుంటున్నా పోలీసులు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నా పోలీసులు మాత్రం చోద్యం చూస్తున్నారు.
     
    ప్రపంచ పర్యాటకులు వచ్చే చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాం తాల్లో వైట్నర్‌కు బానిసలైన పిల్లలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందని పలువురు సూచిస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement