పల్లెపై నిఘా 

CC Cameras Arrangement In All Villages Warangal - Sakshi

సాక్షి, జనగామ: క్షేత్రస్థాయి నుంచే నేరాలను తగ్గించేందుకు పోలీస్‌ శాఖ దృష్టి సారించింది. ఘటన జరగక ముందే శాంతిభద్రతలను కాపాడితే ప్రజల్లో నమ్మకం కలుగుతుందనే లక్ష్యంతో పోలీస్‌ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక వైపు గ్రామ పోలీస్‌ అధికారుల (వీపీఓలు)ను అప్రమత్తం చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది. గ్రామం యూనిట్‌గానే పోలీస్‌ శాఖ శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది.

జిల్లాలో 170 మంది వీపీఓలు..
వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలోని వెస్ట్‌జోన్‌లో ఉన్న జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 170 మంది గ్రామ పోలీస్‌ అధికారులను నియమించారు. 13 మండలాల్లో 301 గ్రామపంచాయతీలు ఉండగా వాటికి పోలీస్‌ అధికారులను నియమించారు. గ్రామాల వారీగా నియమించిన పోలీస్‌ అధికారి సెల్‌నంబర్‌ గ్రామస్తులకు తెలిసే విధంగా ముఖ్య కూడళ్ల వద్ద వాల్‌ రైటింగ్‌ చేయించారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరిగినా ఆ గ్రామ పోలీస్‌ అధికారిని బాధ్యుడిని చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు, అపరిచిత వ్యక్తుల సంచారం వంటి విషయాలు గ్రామ పోలీస్‌ అధికారికి సమాచారం అందించే విధంగాగ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటులో సక్సెస్‌..
అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఓ ప్రత్యేక సాధనంగా మారాయి. ఈ కారణంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్‌ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దాతల సహకారంతో సీసీ కెమెరాల కొనుగోలు, సొంత ఖర్చులతో ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించింది. జిల్లా వ్యాప్తంగా దాతల సహకారంతో 1058 కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా నేను సైతం కార్యక్రమంలో భాగంగా 1580 సీసీ కెమెరాలను బ్యాంకులు, ముఖ్యమైన షాపుల్లో ఏర్పాటు చేశారు.

గ్రామస్థాయి నుంచే ఫోకస్‌..
గ్రామ స్థాయి నుంచి అక్రమాలను నిర్మూలించడమే ధ్యేయంగా పోలీసులు ఫోకస్‌ చేస్తున్నారు. దొంగతనాలు, పేకాట, మట్కా వంటి నేరాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. గుట్కాలు, అంబర్, గంజాయి అక్రమ వ్యాపారం, నిల్వలను గుర్తించి అదుపుచేసే విధంగా వీపీఓలు, సీసీ కెమెరాలను వినియోగించనున్నారు. శాంతియుత వాతావరణంలో పల్లెల్లో ప్రశాంతత నెలకొల్పే విధంగా పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top