
మంథని బీజేపీలో ముసలం చోటుచేసుకుంది. అభ్యర్థి ఎంపికలో అధిష్టానం అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తిని కాకుండా కొత్త వ్యక్తికి అవకాశం కల్పించడంతో సీనియర్లు అలకబూనారు.
సాక్షి, పెద్దపల్లి: మంథని నియోజకవర్గంలో బీజేపీకి అసలే క్యాడర్ తక్కువ. మరోవైపు ఉన్న క్యాడర్‌లోని కొంతమంది ఎన్నికల వేళ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని కమాన్‌పూర్ జెడ్పీటీసీ సభ్యుడు మేకల సంపత్ యాదవ్, మంథని నియోజకవర్గ ఇన్‌చార్జి బోగోజు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. రామగిరి మండలాధ్యక్షుడు పొన్నం సదానందం, యూవమోర్చా మండలాధ్యక్షుడు రాముతో పాటు కమాన్‌పూర్ మండలానికి చెందిన సీనియర్ నాయకుడు శ్రీనివాస్ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. మంథని మండల పార్టీ ప్రధానకార్యదర్శి పార్వతి కిరణ్ గతవారం పదవి, పార్టీకి రాజీనామా చేశారు. బీజేవైఎం మండలాధ్యక్షుడు చిప్ప సత్యనారాయణసహా గుండోజు ప్రవీణ్, దూడం సాయి, దాడి రమేష్, బెజ్జం శ్రీనివాస్, కాళ్ల సతీష్ రాజీనామా చేశారు. తాజాగా ఆదివారం జిల్లా అధికార ప్రతినిధి చిదురాల మధూకర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నాంపల్లి రమేష్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు నారమల్ల కృష్ణ రాజీనామా చేశారు. రాజీనామా ప్రతులను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్‌వీ. సుభాష్‌కు పంపారు.
అభ్యర్థి వైఖరిపై అసంతృప్తి
మంథని బీజేపీ అభ్యర్థి సనత్‌కుమార్ వ్యవహార శైలిపై బీజేపీ, అనుబంధ విభాగాల్లో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న సీనియర్లు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. పార్టీ నుంచి మంథని అసెంబ్లీ టికెట్ కోసం 8 మంది దరఖాస్తు చేసుకోగా తమని కాదని కొత్త వ్యక్తిని ఎంపిక చేసిందని సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సీనియర్లను కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాల్సిన సదరు అభ్యర్థి పట్టించుకోవడంలేదని వారు పేర్కొంటున్నారు. పార్టీని పట్టుకొని ఇంతకాలం ఉన్న తమపట్ల అభ్యర్థి వైఖరి ఏ మాత్రం బాగా లేదని, ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి ఇక్కడ ఏంటని, తమని పట్టించుకునే వారెవరని వారు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా కొద్దిపాటి క్యాడర్ మాత్రమే ఉన్న మంథని బీజేపీలో అసమ్మతి రాగం ఈ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది.