బీజేపీది జనబలం 

Bjp Party Has People Power Said By Janardhan Reddy - Sakshi

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ది ధనబలం

బీజేపీ ఎంపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి   

సాక్షి, దారూరు: దేశ ద్రోహులు, బడా బాబుల వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని నిర్మూలించేందుకే ప్రధాని మోదీ పెద్ద నోట్లను రద్దు చేశారని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం ధారూరు మండల కేంద్రంలో రోడ్‌షోను నిర్వహించారు. ధారూరు బస్టాండు వద్ద హైదరాబాద్‌–వికారాబాద్‌ ప్రధాన రోడ్డుపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశానికి ఒక్కరే ప్రధానమంత్రి ఉంటారని, ప్రతిపక్షాలు మాత్రం జమ్ముకాశ్మీర్‌లో మరో ప్రధానమంత్రి ఉండాలని కోరుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రతిపక్షాలు దేశాన్ని విచ్ఛినం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. మోదీకి కుటుంబం లేకున్నా దేశ ప్రజలే తన కుటంబంగా భావించి వారి అభ్యున్నతి కోసం కంకణం కట్టుకున్నారని అన్నారు. మహిళలలు కట్టెల పొయ్యిలతో తీవ్ర ఇబ్బందులుపడుతుంటే వారికి పీఎం యోజన కింద ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు అందజేశారని పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌లో భాగంగా ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులు అందజేశారని చెప్పారు.

కేసీఆర్‌ కిట్‌కు రూ. 13 వేలు అయితే అందులో రూ. 6 వేలు కేంద్ర సర్కారు అందిస్తోందని అన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఒక్కో వ్యక్తికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తామంటే భయంతో సీఎం కేసీఆర్‌ దానిని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. జిల్లాలో ఈఎస్‌ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేసి అనంతగిరిని టూరిజం హబ్‌గా మారుస్తామని అన్నారు. ఎంఎంటీఎస్‌ రైలును జిల్లాకేంద్రానికి రప్పించేందుకు తాను బాధ్యతను తీసుకుంటానని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు ధనబలం ఉంటే బీజేపీ మాత్రం జనబలం ఉందని ఆయన గుర్తు చేశారు. స్థానికుడైన తనకు ఓటేసి గెలిపించాలని కోరారు.   

తనయుల కోసమే తాపత్రయం 
సీఎం కేసీఆర్‌ తనయుడిని సీఎం చేయాలని ఉవ్విళ్లూరుతుంటే, సోనియమ్మ రాహుల్‌గాంధీని పీఎం చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారని ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పాండుగౌడ్, యువమోర్చా జిల్లా అధ్యక్షుడు వివేకానందరెడ్డి, కార్యవర్గ సభ్యుడు ఎం. రమేశ్, జిల్లా యువమోర్చా ఉపాధ్యక్షుడు రాజేందర్‌గౌడ్, మండల అధ్యక్షుడు జగన్‌గౌడ్, నాయకులు కృష్ణ, నవీన్, సాయి, ప్రకాశ్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top