సంబంధం చెడగొట్టాడని.. వ్యక్తి దారుణ హత్య | Sakshi
Sakshi News home page

సంబంధం చెడగొట్టాడని.. వ్యక్తి దారుణ హత్య

Published Thu, Apr 4 2019 4:33 PM

Arun Kumar Murder Case Jangaon - Sakshi

సాక్షి, చిల్పూరు: పెళ్లి సంబందం చెడగొట్టాడనే నెపంతో వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. ఈ ఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలం ఫత్తేపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని బోడబండతండా సమీపంలో గత నెల 29న జరిగింది. హుస్నాబాద్‌ ఏసీపీ మహేందర్, సీఐ శ్రీనివాస్, కట్కూరు ఎస్‌ఐ పాపయ్య నాయక్, చిల్పూరు ఎస్‌ఐ శ్రీనివాస్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్‌ మండలం చిన్నరాతిపల్లి గ్రామానికి చెందిన కూరపట్ల అరుణ్‌కుమార్‌(30)కి భార్య లత, ఏడాది బాబు ఉన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరుకు చెందిన మాధవితో అరుణ్‌కుమార్‌కు మూడేళ్ల క్రితం పరిచయం ఉండేది.

వారి మధ్య తరచు గొడవలు జరగడంతో అతడు, ఆమెను వదిలి లతను వివాహమాడాడు. అనంతరం మాధవికి చిల్పూరు మండలం ఫత్తేపూర్‌కు చెందిన వేల్పుల రవికుమార్‌తో గత నెల 30న పెళ్లి నిశ్చయమయింది. విషయం తెలుసుకున్న అరుణ్‌కుమార్‌ గతంలో మాధవితో కలిసి తిరిగిన ఫోటోలను, వారు మాట్లాడుకున్న సంభాషణలను పెళ్లికొడుకుకు పంపాడు. దీంతో మాధవిని పెళ్లి చేసుకోనని రవికుమార్‌ చెప్పాడు. తమ కూతురి వివాహాన్ని అడ్డుకున్నాడని మాధవి తండ్రి రాములు, వారి కుటుంబ సభ్యులు గత నెల 29న చిన్నరాతిపల్లికి వెళ్లి అరుణ్‌కుమార్‌ను పెళ్లికొడుకు వద్దకు వచ్చి అబద్ధం చెప్పానని చెప్పాలంటూ ఆటోలో ఎక్కించుకుని వెళ్లారు. అరుణ్‌కుమార్‌ తల్లి మల్లమ్మ కూడా అదే ఆటోలో వెళ్లింది. బోడబండతండా సమీపంలోకి రాగానే అరుణ్‌కుమార్‌ పారిపోయాడు. రాములుతో పాటు వెంట వచ్చిన వారు అరుణ్‌కుమార్‌ను వెంబడిస్తూ వెళ్లి దారుణంగా హత్య చేశారు.

పక్కనే గొయ్యి తీసి పాతిపెట్టారు. ఆటో వద్దకు వచ్చి అరుణ్‌కుమార్‌ తల్లికి మీ కొడుకు తప్పించుకుపోయాడని చెప్పి అదే ఆటోలో వెనక్కి వెళ్లిపోయారు. రెండు రోజులు గడిచిన కొడుకు నుంచి సమాచారం రాకపోవడంతో అనుమానంతో కట్కూరు పోలీస్‌స్టేషన్‌లో అరుణ్‌కుమార్‌ తల్లి  ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని రాములును అదుపులోకి తీసుకుని విచారించగా జరిగిని విషయం వెలుగులోకి వచ్చింది. అనంతరం నిందితులతో ఘటనా స్థలానికి వచ్చి పాతిపెట్టిన శవాన్ని బయటకు తీశారు. కేఎంసీ ప్రొఫెసర్‌ మోహన్‌ నాయక్‌ పోస్టుమార్టం చేయగా చిల్పూరు తహశీల్ధార్‌ శ్రీలత శవ పంచనామా చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement