
చీటూరు గ్రామం
లింగాలఘణపురం జనగామ : మండలంలోని చీటూరులో మరో యువకుడు బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు అప్రమత్తమై మందు డబ్బాను లాక్కొని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఇప్పటికే చీటూరులో నాలుగేళ్లలో పది మంది యువకులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా యుక్త వయసులోనే మద్యానికి బానిసలవడం, చిన్న విషయాలకే క్షణికావేశంలో ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఒకరిని చూసి మరొకరు ఆత్మహత్యలకు పాల్పడడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. యువతలో మనో ధైర్యం కల్పించే విధంగా కౌన్సెలింగ్ నిర్వహిం చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇప్పటికే పది మంది యువకులు ఆత్మహత్య చేసుకోవడం, ఒకరిద్దరు యువకులు కూడా తాము చనిపోతామం టూ తల్లిదండ్రులకు చెబుతుండడం గమనార్హం.
చావుతో ఏదీ పరిష్కారం కాదు
యువకులు ఆత్మహత్యలకు పాల్పడితే సమస్యలు పరిష్కా రం కావు. సమస్యలు ఉంటే ఇంట్లో పెద్దలకు చెప్పాలి. యుక్తవయసులో చనిపోవడంతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగుల్చుతున్నారు.అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై దష్టి సారించాలి.
–పసుల సోమనర్సయ్య, మాజీ ఎంపీపీ, చీటూరు
యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి
గ్రామంలోని యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. ఇప్పటికే నాలుగేళ్లలో పది మందికి పైగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కౌన్సెలింగ్‌తో యువకుల్లో మనోధైర్యం కల్పించాలి. ఎంతో భవిష్యత్ ఉన్న యుక్త వయసు వారే చనిపోవడం గ్రామంలో ఆందోళన కలిగిస్తోంది.
– ఉప్పల మధు, ఎంపీటీసీ సభ్యుడు, చీటూరు