ఉద్యాన నగరిపై ఉగ్రవాదుల గురి


  • రాష్ర్టంలో హైఅలర్ట్

  •  ఢిల్లీలో ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

  •  విధానసౌధతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, ఐటీ కంపెనీల పేల్చివేతకు కుట్ర

  •  ముమ్మరంగా నాకాబందీ

  •  ఐపీఎల్ నేపథ్యంలో స్టేడియం, క్రీడాకారులు బసచేసే హోటళ్లకు మూడంచెల భద్రత

  • సాక్షి, బెంగళూరు : కర్ణాటక పరిపాలన కేంద్ర బిందువైన విధాన సౌధను పేల్చడానికి కుట్రపన్నిన ఐఎస్‌ఐ ఉగ్రవాదిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారన్న వార్తల నేపథ్యంలో హోం శాఖ రాష్ట్ర మంతటా హై అలర్ట్ ప్రకటించింది. బెంగళూరులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీల భవనాలకు భద్రతను పెంచారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు జాహీర్ హుసేన్ అనే ఐఎస్‌ఐ ఉగ్రవాదిని చెన్నైలో పోలీసులు మంగళవారం అర్ధరాత్రి అరెస్టు చేశారు.



    విచారణలో బెంగళూరులోని విధానసౌధతో పాటు మరికొన్ని ఐటీ కంపెనీల కేంద్ర కార్యాలయాలను బాంబులు పెట్టి పేల్చి వేయడానికి కుట్ర పన్నినట్లు జాహీర్‌హుసేన్ పోలీసులకు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా బెంగళూరు నుంచి తమిళనాడుకు వెళ్లే రహదారి ప్రాంతాల్లో నాకాబందీ చేపట్టారు. అనుమానితులను అదుపులోకి విచారణ అన ంతరం వదిలిపెడుతున్నారు. ఐపీఎల్-7 సీజన్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లు

     

    బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు దేశవిదేశాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు బెంగళూరుకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడే సూచనలు ఉండటంతో స్టేడియంతోపాటు, క్రీడాకారులు బసచేసే హోటల్స్ చుట్టూ మూడంచెల భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు.



    క్రీడాకారులు ఒంటరిగా బయటకు వెళ్లకుండా రాష్ట్ర హోం శాఖ ఆదేశాలను జారీ చేయనుంది. ఇదిలా ఉండగా ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటూ కేంద్ర, రాష్ట్ర కారాగారాల్లో ఉంటున్న ఖైదీలను కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు లేదా 100కి ఫోన్ చేసి సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

     

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top