రాబోయే విద్యాసంవత్సరం కోసం 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చే ప్రక్రియ పుణేలో శనివారం పూర్తి అయ్యింది. ఈ పాఠ్య పుస్తకాలను ప్రచురించే బాలభారతి పాఠ్య పుస్తకాల సమీక్ష సమావేశం శివాజీ హాలులో మూడురోజుల పాటు జరిగింది.
పింప్రి, న్యూస్‌లైన్: రాబోయే విద్యాసంవత్సరం కోసం 3వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకాల సిలబస్‌ను మార్చే ప్రక్రియ పుణేలో శనివారం పూర్తి అయ్యింది. ఈ పాఠ్య పుస్తకాలను ప్రచురించే బాలభారతి పాఠ్య పుస్తకాల సమీక్ష సమావేశం శివాజీ హాలులో మూడురోజుల పాటు జరిగింది. ‘జాతీయ విద్యా విధానము (2005)’, ‘బాలల ఉచిత నిర్బంధ విద్యా చట్టం (2009)’ ను అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం 2012 పాఠ్య ప్రణాళికను తయారుచేసింది. ఈ సమీక్ష సమావేశానికి మహారాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు ఉపాధ్యాయులు హాజరయ్యారు. 3వ తరగతి పాఠ్య పుస్తకాన్ని సమీక్షించారు. తర్వాత సలహాలు, సూచనలు అందజేశారు. వీరందరూ ఇచ్చిన సలహాలతో పాఠ్యపుస్తకా న్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తామని ‘తెలుగు భాషా సమితి’ అధ్యక్షుడు భమిడిపాటి శారద హామీ ఇచ్చారు. తర్వాత 3వ తరగతి విద్యా ప్రణాళికను వివరించారు.
విద్యా ప్రణాళిక ఆధారంగా తయారుచేసిన తెలుగు పాఠ్య పుస్తకాలను సభకు తెలుగు భాషాసమితి సభ్యురాలు అనూరాధ పరిచయం చేశారు. పాఠ్య పుస్తకంలోని పాఠాలను సుశీల, విద్యా బెనర్జీ వివరించారు. తెలుగు భాషా సమితి సభ్యులు భూమనపల్లి విజయభాస్కర్‌రెడ్డి ఇతర విషయాలను సూచించా రు. అంతేకాకుండా ప్రస్తుత పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్లాస్టిక్ సంచులను నిషేధించాలని, పాఠశాలల పిల్లల నుంచే దీనిని ప్రారంభించాలని సమావేశంలో పాల్గొన్న వారందరూ ప్రతిజ్ఞ బూనారు. తర్వాత పర్యావరణ సందేశాలతో కూడిన గుడ్డ సంచులను కార్యక్రమానికి హాజరైన సుమారు 50 మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి తెలుగు విశేషాధికారిణి తులసీ భారత్ అందజేశారు. కాగా, ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర పాఠ్య పుస్తక సంస్థ డెరైక్టర్ చంద్ర మణిబోర్కర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషాభిమాని భాగవతుల ఉమామహేశ్వర శర్మ జ్యోతి ప్రజ్వలన గావించి సమావేశం ప్రారంభించారు. మొదట గత నెలలో మృతి చెందిన ప్రముఖ తెలుగు కవి, బాలసాహిత్య వేత్త రచయిత గిడుగు రామ్మూర్తి పంతులు మనుమడు గిడుగు రాజేశ్వరరావుకు శ్రద్ధాంజలి ఘటించి సంతాపం తెలిపారు.