ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులను శిబిరాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ మానవహక్కుల కార్యకర్తలు గురువారం
అఖిలేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం
Jan 2 2014 11:22 PM | Updated on Aug 17 2018 7:32 PM
న్యూఢిల్లీ: ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులను శిబిరాల నుంచి బలవంతంగా ఖాళీ చేయించడాన్ని వ్యతిరేకిస్తూ మానవహక్కుల కార్యకర్తలు గురువారం నగరంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హద్దులను దాటింది. రాజకీయ లాభనష్టాలను దృష్టిలో ఉంచుకొని ముజఫర్‌నగర్ అల్లర్ల బాధితులపట్ల మొండిగా ప్రవర్తించింది. అఖిలేశ్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వంగా వ్యవహరించింద’ని జేటీఎస్‌ఏ ప్రతినిధి మనీశ్ సేథీ పేర్కొన్నారు. ‘ఇంత చల్లటి వాతావరణంలో బాధితులను శిబిరాల్లోని గుడారాల నుంచి ఎలా బయటకు పంపుతారు? ఇది ముమ్మాటికీ మూర్ఖత్వమే’నని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. లోయి, నీమ్ ఖేరీ, భోరా శిబిరాల్లోని గుడారాల నుంచి బాధితులను పోలీసులు బలవంతంగా పంపించివేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపడంతో రాజధానిలోని యూపీ భవన్ ముందు జేటీఎస్‌ఏ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు.
బాధితుల కళ్లముందే గుడారాలను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అడ్డుకున్నవారిని చితకబాదారని ప్రత్యక్ష సాక్షులు చెప్పడంతో పోలీసులకు, అఖిలేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలేశ్ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినదించారు.‘శిబిరాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగానే వెళ్లిపోతున్నారని చెబుతున్న యూపీ సర్కార్ మాటలు పచ్చి అబద్ధమ’ని ఏఎన్‌హెచ్‌ఏడీ కార్యకర్తలు ఆరోపించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని, బాధితులకు రక్షణ కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ యూపీ గవర్నర్ బన్వరీలాల్ జోషికి వినతిపత్రం సమర్పించారు. శిబిరాల కూల్చివేతను వెంటనే నిలిపివేయాలని కోరారు.
Advertisement
Advertisement