గాయత్రీ మిల్క్ డెయిరీపై అధికారుల దాడులు | Officials raide on Gayatri Milk dairy | Sakshi
Sakshi News home page

గాయత్రీ మిల్క్ డెయిరీపై అధికారుల దాడులు

Aug 29 2013 2:54 AM | Updated on Sep 1 2017 10:12 PM

అధిక రోజులు నిలువ ఉండటానికి రసాయనాలు (హెచ్2 ఓ2 - హైడ్రోజన్ ఫెరాక్సైడ్) ఎక్కువగా కలిపిన గాయత్రి పాలు, పెరుగు పాకెట్ల ప్యాకింగ్ తయారీ తేదీని...

సాక్షి, బళ్లారి : అధిక రోజులు నిలువ ఉండటానికి రసాయనాలు (హెచ్2 ఓ2 - హైడ్రోజన్ ఫెరాక్సైడ్) ఎక్కువగా కలిపిన గాయత్రి పాలు, పెరుగు పాకెట్ల ప్యాకింగ్ తయారీ తేదీని ముందస్తుగా వేసి అమ్మకాలు సాగిస్తున్న విషయం అధికారుల దాడితో వెలుగు చూసింది. అధికారుల కథనం మేరకు.. పాలు, పెరుగు ఎక్కువ రోజులు నిలువ ఉండటం కోసం రసాయనాలు ఎక్కువగా కలిపి విక్రయిస్తున్నట్లు గాయత్రి డెయిరీపై హెల్త్, ఫుడ్ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో నగరంలోని ఏపీఎంసీ యార్డ్‌లోని గాయత్రి కోల్డ్ స్టోరేజీలో అధికారులు మంగళవారం రాత్రి సోదాలు నిర్వహించారు.

మంగళవారం 27వ తేదీ అయినప్పటికీ అక్కడి పెరుగు ప్యాకెట్లపై తయారీ తేదీ ఆగస్టు 30, 31వ తేదీలు ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్‌గా తేదీలు ఎందుకు ముద్రించారని అధికారులు సంబంధిత వ్యక్తులను ప్రశ్నించగా.. వారు నీళ్లు నమిలారు. పాలు, పెరుగులో రసాయనాలు కలిపి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మూడు లారీల్లో మొత్తం దాదాపు రూ.70 వేల విలువ చేసే 2000 లీటర్ల పెరుగు ప్యాకెట్లను వారు స్వాధీనం చేసుకున్నారు. వాటిపై ఐదు రోజులు ముందస్తు తేదీ ముద్రితమై ఉంది. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. గాయత్రి మిల్క్ కంపెనీకి సంబంధించిన పాకెట్లను స్వాధీనం చేసుకొని ల్యాబ్‌కు పంపామని చెప్పారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత  చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ దాడుల్లో డీసీఐబీ ఇన్‌స్పెక్టర్ ఉమేష్ ఈశ్వర్ నాయక్, కానిస్టేబుళ్లు దినకర్, రామ్మోహన్, హెల్త్, ఫుడ్ ఇన్ స్పెక్టర్ ముదకప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ కంపెనీ ప్రధాన కార్యాలయం అనంతపురంలో ఉంది. కాగా, పాలు, పెరుగు నిలువ కోసం హెచ్2ఓ2 మోతాదు మించి కలిపితే.. ఆ పాలు తాగిన వారు దీర్ఘకాలంలో అనారోగ్యానికి (గ్యాస్ట్రిక్, ఆయాసం) గురవుతారని వైద్యులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement