శాస్త్రీయత లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
హైదరాబాద్: శాస్త్రీయత లేకుండా పెద్ద నోట్లు రద్దు చేయడంతో దేశంలో ప్రజలు అల్లాడుతున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... కష్టపడి సంపాదించిన డబ్బును తీసుకోవడానికి బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం పడిగాపులు కాస్తున్నారని తెలిపారు. కోట్లాది మంది బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు.
శాస్త్రీయ ఆలోచన చేయకుండా పెద్ద నోట్లు రద్దు చేసిన కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విలువైన సమయమంతా వృధా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 50 కోట్ల పనిగంటల సమయం అభివృద్ధిలో భాగస్వామి కాకుండా నిరుపయోగమయిందని వెల్లడించారు. ఇంకా కోట్ల పని గంటల సమయం వృధా అవుతాయో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. పెద్ద నోట్ల రద్దు ఆత్మహత్యలకు దారితీస్తోందని, కొన్ని వేల పెళ్లిళ్లు ఆగిపోయాయని తెలిపారు. మహిళల బాధ వర్ణనాతీమని పేర్కొన్నారు.
పెద్ద నోట్ల రద్దు గురించి నల్లకుబేరులకు ముందే సమాచారం ఇచ్చారన్న అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. బ్యాంకు ముందు బారులు తీరినవారంతా సామాన్య బడుగు బలహీన వర్గాల ప్రజలేనని తెలిపారు. పాల ప్యాకెట్లకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఉప్పు ధర ఆకాశానంటడం భయాందోళన కలిగిస్తోందన్నారు. కేంద్రం అనాలోచిత నిర్ణయం నల్లకుభేరులకు తగలకుండా సామాన్యులకు తగిలిందని భూమన అన్నారు. మోదీ మహత్తర ఆశయం చివరకు ప్రజల గుండెల్లో గుచ్చుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.