కోహ్లి ముంగిట రెండు రికార్డులు

Virat Kohli Looks Stay On Two Records - Sakshi

రాజ్‌కోట్‌: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఘోర పరాజయం చవిచూసిన టీమిండియా.. కచ్చితంగా రెండో వన్డేలో గెలిచి రేసులో నిలవాలని భావిస్తోంది. రేపు(శుక్రవారం) రాజ్‌వేదికగా జరగబోయే రెండో వన్డేలో టీమిండియా విజయం సాధిస్తేనే సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. ఇది భారత జట్టుకు చావో-రేవో మ్యాచ్‌ కావడంతో అన్ని విభాగాల్లోనూ సత్తాచాటడానికి కసరత్తు చేస్తోంది. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని రెండు రికార్డులు ఊరిస్తున్నాయి. గత మ్యాచ్‌లో 16 పరుగులే చేసిన కోహ్లి.. రేపటి మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే రెండు రికార్డులను నమోదు చేస్తాడు.

ఒకటి ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌  రికార్డు కాగా, మరొకటి సచిన్‌ టెండూల్కర్‌ రికార్డు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా కోహ్లి ఇప్పటివరకూ చేసిన సెంచరీల సంఖ్య 41. దాంతో ఒక కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో పాంటింగ్‌తో కలిసి కోహ్లి సమంగా ఉన్నాడు. ఆసీస్‌తో రెండో వన్డేలో కోహ్లి సెంచరీ సాధిస్తే పాంటింగ్‌ రికార్డును బ్రేక్‌ చేస్తాడు. ఈ జాబితాలో పాంటింగ్‌-కోహ్లిల తర్వాత స్థానంలో దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌(33) ఉన్నాడు. 

ఇక ఆస్ట్రేలియాపై వన్డేల్లో కోహ్లి ఇప్పటివరకూ చేసిన సెంచరీల సంఖ్య 8. అయితే ఇక్కడ సచిన్‌ టెండూల్కర్‌ టాప్‌లో ఉన్నాడు. ఆసీస్‌పై వన్డేల్లో సచిన్‌ 9 శతకాలు సాధించాడు. ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత క్రికెటర్‌గా టెండూల్కర్‌తో కలిసి అగ్రస్థానంలో నిలవడానికి కోహ్లి సెంచరీ దూరంలో ఉన్నాడు. మరి ఈ రెండు రికార్డులను ఆసీస్‌తో రెండో వన్డేలో కోహ్లి సాధిస్తాడో.. లేదో చూడాలి.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top