టీమిండియా వీక్‌నెస్ బయటపెట్టిన డుప్లెసిస్

south africa captain Du Plessis reveals Team Indias weakness - Sakshi

జొహన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు వరుస టెస్టుల్లో ఓటమిపాలై సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాను మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యర్థి దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్‌, ఆ టీమ్ కెప్టెన్ డుప్లెసిస్ మాత్రం భారత జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. సిరీస్‌ను కోల్పోవడం కంటే కూడా విరాట్ కోహ్లీ సేన మెరుగైన ప్రదర్శన చేసిందని డివిలియర్స్ మెచ్చుకోగా, బాగా ఆడినా టీమిండియా ఓటమికి గల కారణాలపై డుప్లెసిస్ తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు.

‘దక్షిణాఫ్రికా, భారత్ జట్లలో ఎంతో నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఉన్నారు. అయితే విజయం కోసం మా జట్టులో డివిలయర్స్‌, నేను, డీన్‌ ఎల్గర్‌, ఓపెనర్ మర్‌క్రాం పరుగులు సాధిస్తున్నాం. కానీ భారత్ విషయానికొస్తే కేవలం కోహ్లీ చేసే పరుగుల పైనే ఆ జట్టు ఆధారపడుతోంది. ఇదే భారత జట్టు మైనస్ పాయింట్. అలా ఒకే ఆటగాడిపై ఆధారపడితే సత్ఫలితాలు రాబట్టం కష్టం. మా తరహాలోనే టీమిండియా సమష్టిగా రాణిస్తే వారి విజయావకాశాలు మెరుగవుతాయి. ఇరుజట్ల బౌలర్లు అద్బుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా విదేశాల్లో టెస్ట్ సిరీస్ అంటే ఏ దేశానికైనా సవాల్ వంటిదే. కానీ ప్రతి విభాగంలో ఆటగాళ్లు సత్తాచాటితే ఎక్కడైనా విజయం సాధించవచ్చు. కీలక సమయాల్లో భారత బ్యాట్స్‌మెన్ ఒత్తిడికి లోనవుతున్నారు. ఇతర అన్ని విషయాల్లో రెండు జట్లు సమ ఉజ్జీలుగానే ఉన్నాయని’ డుప్లెసిస్ వివరించాడు.

భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య ఈ నెల 24న జొహన్నెస్‌బర్గ్‌లో సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ప్రారంభంకానుంది. కేప్‌టౌన్, సెంచూరియన్ టెస్టుల్లో ఓటమి పాలైన టీమిండియా ఇదివరకే 2-0తో సిరీస్‌ను కోల్పోయింది. చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు కాపాడుకోవాలని కోహ్లీ సేన భావిస్తోంది.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top