బెంగళూరు గెలిచిందోచ్‌

Rcb first win, beat Punjab by 8 wickets - Sakshi

ఏడో మ్యాచ్‌లో బోణీ చేసిన  రాయల్‌ చాలెంజర్స్‌ 

పంజాబ్‌పై 8 వికెట్లతో విజయం

రాణించిన కోహ్లి, డివిలియర్స్‌

గేల్‌ వీరోచిత ఇన్నింగ్స్‌ వృథా   

ఒకటి కాదు... రెండు కాదు... బెంగళూరు ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లాడింది. ఎట్టకేలకు ఏడో మ్యాచ్‌లో బోణీ కొట్టింది. కోహ్లి పట్టుదల, డివిలియర్స్‌ మెరుపులు రాయల్‌ చాలెంజర్స్‌కు తొలి విజయాన్ని అందించాయి. ఈ మ్యాచ్‌లో బౌలర్లు కాస్త మెరుగనిపించారు. బ్యాటింగ్‌లో టాపార్డరే విజయందాకా లాక్కొచ్చింది. ఆఖర్లో స్టొయినిస్‌ ధనాధన్‌ ఒత్తిడిని జయించేలా చేసింది.  బెంగళూరును గెలిపించింది.  

మొహాలి: హమ్మయ్య బెంగళూరు కూడా పాయింట్ల పట్టికలో గెలుపు కాలమ్‌ను భర్తీ చేసింది. ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లాడినా అందని విజయం ఏడో మ్యాచ్‌లో దక్కింది. శనివారం జరిగిన పోరులో రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు 8 వికెట్లతో పంజాబ్‌పై ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. క్రిస్‌ గేల్‌ (64 బంతుల్లో 99 నాటౌట్‌; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగాడు. చహల్‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు 19.2 ఓవర్లలో 2 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ కోహ్లి (53 బంతుల్లో 67; 8 ఫోర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (38 బంతుల్లో 59 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో అదరగొట్టారు. 

సుడి‘గేల్‌’ ఆఖరిదాకా... 
టాస్‌ నెగ్గిన బెంగళూరు కెప్టెన్‌ కోహ్లి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో పంజాబ్‌ పరుగులు ప్రారంభించేందుకు దిగింది. ఉమేశ్‌ తొలి ఓవర్లో 2 పరుగులే ఇచ్చాడు. తర్వాత సైనీ ఓవర్లో బౌండరీతో గేల్‌ పరుగుల ప్రవాహానికి తెరలేపాడు. మూడో ఓవర్‌ను ఉమేశ్‌ వేయగా 4, 6తో 14 పరుగులు రాబట్టాడు. ఇక హైదరాబాదీ పేసర్‌ సిరాజ్‌ బౌలింగ్‌కు దిగితే బౌండరీలకు గేట్లెత్తినట్లుగా బాదేశాడు గేల్‌. ఈ ఆరో ఓవర్లో 4, 6, 4, 0, 6, 4తో ఏకంగా 24 పరుగుల్ని పిండుకున్నాడు. పవర్‌ ప్లేలో పంజాబ్‌ స్కోరు 60/0. ఇందులో గేల్‌ ఒక్కడివే 48 కావడం విశేషం. శుభారంభం దక్కిన కింగ్స్‌ ఇన్నింగ్స్‌కు చహల్‌ తన తొలి ఓవర్‌ (ఇన్నింగ్‌ 7వ)లో బ్రేక్‌ వేశాడు. మొదటి బంతికి సిక్సర్‌ కొట్టిన రాహుల్‌ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. దీంతో 66 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. తర్వాత మయాంక్‌ అగర్వాల్‌ క్రీజులోకి వచ్చినా... ఎంతోసేపు నిలువలేకపోయాడు. గేల్‌ 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. తన రెండో ఓవర్లో చహల్‌... మయాంక్‌నూ ఔట్‌ చేశాడు. అచ్చు రాహుల్‌ లాగే సిక్స్‌ కొట్టి మరుసటి బంతికే మయాంక్‌ (15; 1 ఫోర్, 1 సిక్స్‌) ఔటయ్యాడు. ఈ దశలో గేల్‌ నెమ్మదించాడు. పరుగుల వేగం తగ్గింది. 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఆ తర్వాతి ఓవర్లోనే సర్ఫరాజ్‌ ఖాన్‌ (15; 1 ఫోర్, 1 సిక్స్‌)ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. స్వల్ప వ్యవధిలో స్యామ్‌ కరన్‌ (1) మొయిన్‌ అలీ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. అలా 113 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ పడింది. అనంతరం గేల్‌కు మన్‌దీప్‌ సింగ్‌ జతయ్యాడు. మరో వికెట్‌ పడకుండా ఇద్దరు పరుగుల వేగం పెంచారు. చివరి ఓవర్లో ఆఖరి బంతికి ఫోర్‌ కొట్టడంతో గేల్‌ సరిగ్గా 99 స్కోరు చేసి సెంచరీకి పరుగు దూరంలో అజేయంగా ఆగిపోయాడు. 

ధాటిగా మొదలైంది... 
ఎలాగైనా గెలవాలన్నా కసో లేక మిడిలార్డర్‌పై అపనమ్మకమో గానీ... కోహ్లి, పార్థివ్‌ పటేల్‌ ద్వయం బెంగళూరు ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలుపెట్టింది. పార్థివ్‌ ఇన్నింగ్స్‌ తొలి బంతినే బౌండరీకి తరలించాడు. రెండో ఓవర్లో కోహ్లి రెండు, పార్థివ్‌ మరో ఫోర్‌ కొట్టారు. మూడో ఓవర్లో ఈ సారి కోహ్లి ఒక బౌండరీ బాదితే... పార్థివ్‌ రెండు బాదాడు. 3 ఓవర్లలో రాయల్‌ చాలెంజర్స్‌ స్కోరు 36/0. నాలుగో ఓవర్‌ వేసిన అశ్విన్‌... పార్థివ్‌ (9 బంతుల్లో 19; 4 ఫోర్లు)ను ఔట్‌ చేసి ఈ జోడీని విడగొట్టాడు. తర్వాత డివిలియర్స్‌ వచ్చిరాగానే 2 ఫోర్లు కొట్టడంతో పవర్‌ ప్లేలో బెంగళూరు వికెట్‌ నష్టానికి 63 పరుగులు చేసింది. 

కోహ్లి, డివిలియర్స్‌ ఫిఫ్టీ–ఫిఫ్టీ 
కోహ్లి, డివిలియర్స్‌ ఇద్దరు క్రీజ్‌లో పాతుకుపోవడంతో పంజాబ్‌ బౌలర్లకు కష్టాలు తప్పలేదు. ముఖ్యంగా డివిలియర్స్‌ పాదరసంలా పరుగెత్తాడు. దీంతో సింగిల్స్‌ వచ్చే చోట బెంగళూరు రెండేసి పరుగుల్ని చకచకా సాధించింది. 10 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 88/1. ఇద్దరు సమన్వయంతో ఆడటంతో భారీషాట్లు కొట్టకుండానే బెంగళూరు అవసరమైన రన్‌రేట్‌ను సాధిస్తూ వచ్చింది. 11వ ఓవర్లో కోహ్లి 37 బంతుల్లో (7 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటే 12వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. మెరుపుల్లేకపోయినా పరుగులు మాత్రం చేస్తుండటంతో పంజాబ్‌ బౌలర్లకు ఎటూ పాలుపోలేదు. ఈ ద్వయాన్ని పడగొట్టలేక, పరుగుల్ని నియంత్రించలేక విలవిల్లాడారు. ఇలా చూస్తుండగానే రాయల్‌ చాలెంజర్స్‌ 15 ఓవర్లలో 126/1 స్కోరు చేసింది. ఇక ఆఖరి 5 ఓవర్లలో ‘బెంగ’తీరే విజయానికి 48 పరుగులు కావాలి. 16వ ఓవర్‌ వేసిన షమీ... కోహ్లి వికెట్‌ తీశాడు. దీంతో 85 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ ఓవర్లో 4 పరుగులు, 17వ ఓవర్లో 6 పరుగులు రావడంతో చేయాల్సిన రన్‌రేట్‌ ఒక్కసారిగా పెరిగింది. 18 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో అండ్రూ టై వేసిన 18వ ఓవర్లో స్టొయినిస్‌ 2 ఫోర్లు, డివిలియర్స్‌ సిక్స్‌ బాదాడు. దీంతో 18 పరుగులు రాగా, డివిలియర్స్‌ 35 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్నాడు. షమీ 19 ఓవర్లో 14 పరుగులిచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో 6 పరుగులు అవసరమైతే స్టొయినిస్‌ (16 బంతుల్లో 28 నాటౌట్‌; 4 ఫోర్లు) 4, 2తో మరో 4 బంతులు మిగిలుండగానే ముగించాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top