అల్జీరియా హీరో.. స్లిమాని | Fabio Capello blames laser beam for Russia’s elimination by Algeria | Sakshi
Sakshi News home page

అల్జీరియా హీరో.. స్లిమాని

Jun 28 2014 12:59 AM | Updated on Oct 22 2018 5:58 PM

పై ఫోటోలో గోల్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు అల్జీరియా దేశస్తులకు ఆరాధ్యుడు. ఈ ఒక్క గోల్‌తో అతడిని అల్జీరియన్స్ తమ హీరోగా భావిస్తున్నారు.

కురిటీబా: పై ఫోటోలో గోల్ చేస్తున్న వ్యక్తి ఇప్పుడు అల్జీరియా దేశస్తులకు ఆరాధ్యుడు. ఈ ఒక్క గోల్‌తో అతడిని అల్జీరియన్స్ తమ హీరోగా భావిస్తున్నారు. ఇంత సంబరాలకు కారకుడైన వ్యక్తి.. స్ట్రయికర్ ఇస్లాం స్లిమాని. అల్జీరియా ఇప్పటిదాకా ప్రపంచకప్ చరిత్రలో ఒక్కసారి కూడా నాకౌట్‌కు చేరలేదు. గతంలో మూడు పర్యాయాలు ఈ మెగా టోర్నీలో ఆడినా గ్రూప్ దశలోనే వెనుదిరిగింది.
 
 ఈసారి మాత్రం జట్టుకు అద్భుత అవకాశం చిక్కింది. రష్యాతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌ను డ్రా చేసుకుని ఒక్క పాయింట్ దక్కించుకున్నా చరిత్ర సృష్టించవచ్చు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున బరిలోకి దిగిన అల్జీరియాకు ప్రత్యర్థి రష్యా ఆరో నిమిషంలోనే గోల్ చేసి షాక్ ఇచ్చింది. దిమిత్రి కొంబరోవ్ ఎడమ కాలితో ఇచ్చిన పాస్‌ను అలెగ్జాండర్ కొకోరిన్ హెడర్ గోల్ చేశాడు. దీంతో రష్యా ప్రథమార్ధంలో 1-0తో విరామానికి వెళ్లింది.
 
 ద్వితీయార్ధంలో మ్యాచ్ సాగుతున్న కొద్దీ అల్జీరియా అభిమానుల్లో ఒకరకమైన నిర్వేదం అలుముకుంటోంది. ఈ సమయంలో ఇస్లామ్ స్లిమాని తమ దేశానికి మధురమైన కానుక ఇచ్చాడు. 60వ నిమిషంలో మిడ్‌ఫీల్డర్ యాసిన్ బ్రహిమి ఫ్రీ కిక్‌ను... గోల్ పోస్టు దగ్గరే ఉన్న స్లిమాని అమాంతం గాల్లోకి ఎగిరి తలతో బంతిని గోల్ పోస్టులోనికి నెట్టాడు. అంతే.. ఈ  క్షణం కోసమే ఎదురుచూస్తున్న ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. చివరకు మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. తాము అనుకున్న ఫలితం రావడ ంతో అల్జీరియాలోనూ పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అటు రష్యా నాకౌట్‌కు వెళ్లాలంటే ఈ మ్యాచ్‌ను కచ్చితంగా నెగ్గాల్సి ఉన్నా డ్రా కావడంతో నిరాశ తప్పలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement