అయ్యో... ఐర్లాండ్‌

England beat Ireland by 143 runs to win - Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే ఆలౌట్‌

ఇంగ్లండ్‌తో టెస్టులో 143 పరుగుల తేడాతో ఓటమి

కుప్పకూల్చిన వోక్స్‌ (6/17), బ్రాడ్‌ (4/19)  

పటిష్టమైన ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కనీసం వంద పరుగులైనా చేయకుండా అడ్డుకుని, ఆపై బ్యాటింగ్‌లో మెరుగ్గా ఆడి చెప్పుకోదగ్గ ఆధిక్యం సాధించిన ఐర్లాండ్‌ జట్టు... రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆ స్థాయి ఆటను కనబర్చలేకపోయింది. బౌలింగ్‌లో పట్టువిడిచి, బ్యాటింగ్‌లో చేతులెత్తేసి అత్యల్ప స్కోరుకు కుప్పకూలింది. ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో సంచలన విజయం సాధించే సువర్ణావకాశాన్నీ చేజార్చుకుంది.    

లండన్‌: ఇంగ్లండ్‌ దెబ్బకు ఐర్లాండ్‌ హడలెత్తిపోయింది. 181 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు పేసర్లు క్రిస్‌ వోక్స్, స్టువర్ట్‌ బ్రాడ్‌ ధాటికి నిలవలేక రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 38 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా 143 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన నాలుగు రోజుల టెస్టు మూడో రోజే ముగిసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 303/9తో శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ అదే స్కోరు వద్ద ఆలౌటైంది. అనంతరం ఐర్లాండ్‌ ఏదశలోనూ లక్ష్యం అందుకునేలా కనిపించలేదు. నాలుగో ఓవర్‌ చివరి బంతికి కెప్టెన్‌ పోర్టర్‌ఫీల్డ్‌ (2)ను పెవిలియన్‌ చేర్చిన వోక్స్‌... ప్రత్యర్థి పతనానికి బాటలు వేశాడు. ఆ వెంటనే మరో ఎండ్‌లో బాల్‌బ్రైన్‌ (5)ను బ్రాడ్‌ బలిగొన్నాడు. వోక్స్‌ ప్రతాపానికి స్టిర్లింగ్‌ (0) ఖాతా కూడా తెరవలేకపోయాడు.

జేమ్స్‌ మెకల్లమ్‌ (11), విల్సన్‌ (0)లను మూడు బంతుల వ్యవధిలో అతడే ఔట్‌ చేశాడు. దీంతో ఐర్లాండ్‌ 24 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్రాడ్‌ విజృంభించి మూడు వికెట్లు తీశాడు. ముర్టాగ్‌ (2) వికెట్లను గిరాటేసి వోక్స్‌ లాంఛనం పూర్తిచేశాడు. మూడో బౌలర్‌ ప్రమేయం లేకుండా 15.4 ఓవర్ల (బ్రాడ్‌ 8; వోక్స్‌ 7.4)లోనే ఐర్లాండ్‌ కథ ముగియడం విశేషం. ఆ జట్టు ఇన్నింగ్స్‌లో మెకల్లమ్‌ చేసినవే అత్యధిక పరుగులు. ఏకైక రెండంకెల స్కోరూ అదే కావడం గమనార్హం. ముగ్గురు డకౌటవగా మరొకరు సున్నా పరుగులతో నాటౌట్‌గా మిగిలారు. 11వ నంబర్‌ ఆటగాడే అయినా...రెండో ఇన్నింగ్స్‌లో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి 92 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ జాక్‌ లీచ్‌ తన బ్యాటింగ్‌ ప్రదర్శనకు ‘మ్యాన్‌  ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top