చంద్రబాబుది నయవంచన పాలన

Babu Is A Dirty Politician - Sakshi

జగన్‌కు ఒక్క అవకాశమిస్తే ఏపీ అగ్రగామి

మాజీ మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి   

సాక్షి, వెంకటాచలం: చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నయవంచనకు గురిచేసి పారిపాలన కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వెంకటగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. వెంకటాచలం మండలం కసుమూరులో శనివారం వైఎస్సార్‌సీపీ  ఆధ్వర్యంలో  రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి హాజరయ్యారు. తొలుత కసుమూరు మస్తాన్‌వలీ దర్గాలో వైఎస్సార్‌సీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆనం మాట్లాడుతూ గత ఎన్నికల ముందు 600పైగా వాగ్దానాలిచ్చిన చంద్రబాబు ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకుండా ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు.

టీడీపీ ప్రభుత్వానికి ముందు రాష్ట్రంలో అప్పుల భారం రూ.86 వేల కోట్లుండగా ప్రస్తుతం మరో రూ.1.50 లక్షల కోట్ల అప్పులు భారాన్ని చంద్రబాబు మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన అప్పులను అభివృద్ధికి వినియోగించకుండా పందికొక్కుల్లా పంచుకున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ వ్యవస్థకు అడ్డుకట్ట పడాల్సిన అవసరాన్ని ప్రజానీకం గుర్తించాలని పిలుపునిచ్చారు. మరో ఐదేళ్లు బాబు అధికారంలో ఉంటే భవిష్యత్‌ తరాల ప్రజలు ఇబ్బందుల్లో పడతారని తెలిపారు. టీడీపీ పాలనలో దొడ్డిదారిన వచ్చేవారు ఎక్కువైపోయి వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ కోసం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశమిస్తే ఏపీని అగ్రగామిగా మార్చుతారని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తే మళ్లీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు.

వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ బాబు పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగ యువతకు, ఇలా ఏ వర్గానికీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదన్నారు. చంద్రబాబు, కరువు కవలపిల్లలు లాంటివారన్నారు. బాబు అధికారంలో ఉంటే రాష్ట్రంలో వర్షాలు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి మాటున రూ.కోట్లలో అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీరు–చెట్టు పథకంలో అవసరం లేని కాలువలు తవ్వి ప్రజాధనాన్ని దోచుకోవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి జరిగితే సంగం, కనుపూరు కెనాల్‌ ఆధునీకరణ ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. మంత్రి సోమిరెడ్డి ఓట్లు తొలగింపు వివాదంపై మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వారే తొలగిస్తున్నారని సోమిరెడ్డి చెప్పే మాటలు విని జనం నవ్వుకుంటున్నారని హేళన చేశారు. దొంగ ఓట్ల విషయంలో టీడీపీ నాయకుల చేసే కుట్రలను ప్రశ్నిస్తే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై కేసులు పెట్టి అరెస్టు చేయడం దారుణమన్నారు.    
 

వైఎస్సార్‌సీపీలో చేరిక
మండలంలోని చవటపాళెం గ్రామానికి చెందిన పీఏసీఏస్‌ ఉపాధ్యక్షుడు వళ్లూరు రమణయ్యనాయుడు, కసుమూరు గ్రామానికి చెందిన తూమాట మధునాయుడు, జి.వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో కుడితిపూడి మురళీనాయుడు, ఎం.సుధాకర్‌నాయడుతోపాటు 300 కుటుం బాలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వీరికి మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్‌ వేమారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్‌ మునుకూరు రవికుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి కె.కోదండరామిరెడ్డి, సంయుక్త కార్యదర్శి కె.విజయమోహన్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్‌ కె.చెంచుకృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షుడు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు శ్రీధర్‌నాయుడు, జిల్లా, మండల కో–ఆప్షన్‌ సభ్యులు అక్బర్‌బాషా, హుస్సేన్‌ పాల్గొన్నారు.    

Read latest PSR Nellore News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top