డాక్టరు పట్టాకు రూ. 25 వేలు? | 25thousend bribery for doctor certificate in rims medical college | Sakshi
Sakshi News home page

డాక్టరు పట్టాకు రూ. 25 వేలు?

Feb 10 2018 12:52 PM | Updated on Feb 10 2018 12:52 PM

25thousend bribery for doctor certificate in rims medical college - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఒంగోలు సెంట్రల్‌: ఒంగోలు రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ ఫైనల్‌ ఇయర్‌ పాస్‌ అవ్వాలంటే కనీసం రూ. 25 వేలు ఇవ్వాలంటూ సర్జరీ విభాగంకు చెందిన ప్రొఫెసర్‌ బేరం పెట్టాడు. దీంతో విద్యార్థులు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే డైరెక్టర్‌ దృష్టికి కూడా వెళ్లడంతో గురువారం విద్యార్థులను పిలిపించి విచారణ నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. దీంతో ప్రొఫెసర్‌ బేరాలకు దిగాడు.

గతంలో మాదిరిగా రూ. 10 వేలు ఇస్తే కుదరదని రూ. 25 వేలు చెల్లించాల్సిందేనని పట్టు బట్టాడు. ఎగ్జామినర్లకు వసతి, భస, భోజనం, విందు వంటి ఖర్చులకు ఈ డబ్బు వాడతామని చెప్పాడు. ఇదే వ్యవహారంలో గతంలో రూ. 10 వేలు చొప్పున వసూలు చేసిన రిమ్స్‌ అధికారులు ఏకంగా భారతీయ వైద్య మండలి అధికారుల విచారణనే ఎదుర్కొనాల్సి వచ్చింది. అయినప్పటికీ ప్రొఫెసర్ల తీరు మారలేదు. కాగా రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మస్తాన్‌ సాహెబ్‌కు విషయం తెలియడంతో విద్యార్థులతో మాట్లాడారు. అయితే ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు విద్యార్థులు భయపడినట్లు సమాచారం.

డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు: డాక్టర్‌ మస్తాన్, రిమ్స్‌ డైరెక్టర్‌
రిమ్స్‌లో ఎంబీబీఎస్‌ విద్యార్థులు ఎవరికీ డబ్బు చెల్లించాల్సిన అవసరంలేదు. బాగా చదువుకుని పరీక్షలు రాయాలి. ఎవరైనా ఇలాంటి వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఓ ప్రొఫెసర్‌పై ఆరోపణలు రావడంతో విద్యార్థులను విచారించాం.

ఓ హోటల్‌తో ఎంఓయూ
ఒంగోలు నగరం 60 అడుగుల రోడ్డులోని ఓ హోటల్‌తో ఎంఓయూ కుదుర్చుకున్నట్లు రిమ్స్‌ డైరెక్టర్‌ తెలిపారు. రిమ్స్‌కు వచ్చే ఎక్స్‌టర్నల్‌ ఎగ్జామినర్లు ఈ హోటల్‌లో బస చేయవచ్చని, దీనికి సంబంధించిన బిల్లులను రిమ్స్‌ నుంచి చెల్లిస్తామన్నారు. విద్యార్థుల మీద భారం పడకూడదని ఈ నిర్ణయిం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement