ప్రకాష్‌రెడ్డి ప్రచారానికి పోలీసుల అడ్డంకులు | Sakshi
Sakshi News home page

ప్రకాష్‌రెడ్డి ప్రచారానికి పోలీసుల అడ్డంకులు

Published Fri, Mar 22 2019 8:29 AM

YSRCP MLA Candidate Thopudurthi Prakash Reddy Campaign Stopped By Police Men - Sakshi

సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజక వర్గంలోని రామగిరి మండలంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి పోలీసులు అడుగడుగునా అడ్డంకుల వేశారు. టీడీపీ ప్రభుత్వ ఐదాళ్ల కాలంలో శాంతిభద్రతల పేరుతో   ప్ర కాష్‌రెడ్డిని రామగిరి మండలంలోకి రాకుండా అడ్డుకొన్న పోలీసులు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూడా అదేతంతు  కొనసాగిస్తున్నారు. ఎన్నికల అధికారుల నిబంధనల ప్రకారం అభ్యర్థులు ఎక్కడికైనా వెళ్లి స్వేచ్ఛగా ప్రచారం చేసుకొనే హక్కు ఉంది. ఒకవైపున నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి ప్రచారానికి ఎటువంటి నిబంధనలు పాటించని పోలీస్‌ అధికారులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ప్రచారానికి మాత్రం అడ్డంకులు చెపుతున్నారు.

రామగిరి మండలంలో కలికివాండ్లపల్లి, గంత్రిమర్రి, పోలేపల్లి, చెర్లోపల్లి, కుంటిమద్ది  జరిగిన ఎన్నికల ప్రచారంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా రాకుండా పోలీస్‌ అధికారులు అడ్డుకట్టలు వేశారు. అయినప్పటికీ మంత్రి పరిటాల సునీత సొంత మండలంలో ప్రజలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టారు.  కలికివాండ్ల, గంతిమర్రి గ్రామాల్లో ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ నాయకులు వేపకుంట రాజన్న, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల కన్వీనర్లు గోవిందరెడ్డి, నాగరాజులతో పాటు పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు జాతీయ రహదారి వద్దనే పోలీసులు అడ్డుకొన్నారు.

ఎన్నికల అధికారి అనుమతులు ఉన్న వాహనాలు తప్ప ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లకూడదని పోలీసులు అడ్డుచెప్పారు. దీంతో పాటు కుంటమద్ది, పోలేపల్లికి వెళ్లే ఎన్‌ఎస్‌ గేట్‌ వద్ద కూడా పోలీసులు కాపుకాచి వైఎస్సార్‌సీపీ నాయకులను అడ్డుకొన్నారు.పోలీసులు అడ్డంకులతో వాహనాలకు పక్కన పెట్టి చివరకు పొలాల మీదుగా నడుచుకొని వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు పోలేపల్లి వద్ద ఆపి వారిపై లాఠీ చార్జీ  చేశారు. రామగిరి ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌తో పాటు స్పెషల్‌ పార్టీ పోలీసులు చేసిన లాఠీ చార్జీలో పలువురు పార్టీ కార్యకర్తలకు గాయపడినట్లు వైఎస్సార్‌సీపీ నాయకులు   తెలిపారు. దీంతో పాటు ధర్మవరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన పోలీస్‌ అధికారి ప్రచారంలో పార్టీ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించటంతో పాటు అనుమతి ఉన్న వాహనాలను కూడా అడ్డంకులు చెప్పారని వారు తెలిపారు.  

Advertisement
Advertisement