భజన మాని భరోసా ఇవ్వండి..

YSRCP leader Gowru venkat reddy criticize the TDP leaders - Sakshi

అధికార పార్టీ నేతలకు గౌరు వెంకటరెడ్డి చురక 

వర్షాలకు 22 మండలాల్లో 31 వేల హెక్టార్ల పంట నష్టం

బాధిత రైతులకు అండగా నిలవాలని సూచన 

సాక్షి, కర్నూలు : ‘ఇటీవలి వర్షాలు, వరదలు పంటలపై తీవ్ర ప్రభావం చూపాయి. జిల్లా వ్యాప్తంగా 22 మండలాల పరిధిలో 31 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.  ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పంట నష్టపరిహారం మంజూరు చేయించి బాధిత రైతులకు అండగా నిలవండి. హెక్టారుకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టారు. కనీసం రూ. 50వేల పరిహారం చెల్లించే విధంగా చూడండి’ అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షు డు గౌరు వెంకటరెడ్డి అధికార పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. 

పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం గౌరు వెంకటరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడా రు. కొందరు టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు చొరవతోనే వర్షాలు పడుతున్నాయని, ఫలితంగా రిజర్వాయర్లన్నీ నిండుతున్నాయనిప్రచారం చేసుకోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రికి భజన చేయడం మాని రైతన్నలకు అండగా నిలిచి సాగుపై వారికి భరోసా ఇవ్వాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులకు సూచించారు. ఏ గ్రామంలో చూసినా చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఇళ్లు, గుడిసెలు కూలిపోయాయని, అలాంటి వారికి వెంటనే గృహవసతి కల్పించాలన్నారు. కొందరి గొర్రెలు, మేకలు, అవులు, ఇతర పశువులు వరదల కారణంగా చనిపోయాయని, పరిహారం చెల్లించాలన్నారు.  

నాసిరకం పనులతోనే గండ్లు... 
ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవాతోపాటు కొన్ని వంకలు, వాగులు వరద ఉద్ధృతికి తెగిపోవడం వల్లే  పంటలు నష్టపోవడం, ఇళ్లలోకి నీరు చేరడం, గృహాలు కూలిపోవడం తదితర సమస్యలకు కారణమైందని గౌరు వెంకటరెడ్డి తెలిపారు. నాసిరకంగా పనులు చేయడంవల్లే గండ్లు పడ్డాయన్నారు. కమీషన్ల కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు లాలూచీ పడడంతో ప్రజలు కష్టాలు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవడంతోపాటు దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులకు మరమ్మతులు చేయించి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులపై ఉందన్నారు.  విలేకరుల సమావేశంలో పార్టీ నాయకులు వెంకటకృష్ణారెడ్డి, విజయకుమారి, రాజావిష్ణువర్దన్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, రమణ, ఫిరోజ్‌ఖాన్‌ కరుణాకరరెడ్డి, కురువ నాగరాజు, జగదీశ్వరరెడ్డి, శివకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top