
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో పోలీసులకు ప్రత్యామ్నాయంగా పారామిలిటరీ భద్రతా బలగాలను వినియోగించుకోవడం పట్ల కేంద్ర హోం మంత్రిత్వశాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోలీసులకు బదులుగా కేంద్ర బలగాలను వినియోగించుకోవద్దని, కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వారి సేవలను వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టంచేసింది. అలాగే అంతర్గత భద్రత, నిఘా సమాచారం తదితర విషయాలపై కేంద్ర సాయుధ బలగాల అవసరంపై కమిటీ ఏర్పాటుచేసి పరిశీలించాలని రాష్ట్రాలను ఆదేశించింది.
కేంద్ర సాయుధ బలగాల విధులకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాల (ఎస్‌ఓపీఎస్)ను రూపొందించామని.. దీని ప్రకారం సరిహద్దుల భద్రత, తిరుగుబాటు, దేశ వ్యతిరేక కార్యకలపాల లాంటి అత్యవసర పరిస్థితుల్లో అవసరార్థం కేంద్ర బలగాలను వాడుకోవాలని వివరించింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయమై డార్జిలింగ్‌లో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో విధుల్లో ఉన్న సీఏపీఎఫ్ బలగాల్ని కేంద్రం ఉపసంహరించుకుంది. దీనిపై సీఎం మమతా బెనర్జీ కేంద్ర హోమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫోన్ చేసి నిరసన వ్యక్తం చేశారు.