పది కోట్లు కాదు..10 లక్షలే

Naini narsimha reddy about trs - Sakshi

హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి

కాంగ్రెస్‌లోకి వెళ్లేది లేదు.. కేసీఆరే ఆదేశాలే శిరోధార్యం

సాక్షి, హైదరాబాద్‌: ఎల్బీనగర్‌ నియోజకవర్గం నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని సూచిస్తూ కేసీఆర్‌ రూ.5 లక్షలో, రూ.10 లక్షలో ఇస్తానన్నారని, కానీ తాను లక్షలు అనబోయి పొరపాటున రూ.10 కోట్లు అన్నానని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వివరణ ఇచ్చారు. ముషీరాబాద్‌ టికెట్‌ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్‌ వచ్చినా రాకపోయినా కేసీఆరే తమ నాయకుడని, ఆయన ఆదేశాలను శిరసావహిస్తానని స్పష్టం చేశారు.

టీఆర్‌ఎస్‌ఎల్‌పీ కార్యాలయంలో నాయిని మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు షోలు చేస్తోన్న కాంగ్రెస్‌ పార్టీ ముందు అభ్యర్థుల్ని ప్రకటించాలన్నారు. అసెంబ్లీ రద్దుపై డీకే అరుణ కోర్టుకెళ్లారని.. అసెంబ్లీ రద్దు అధికారం కేబినెట్‌కు ఉంటుందన్న విషయం మంత్రి పదవి వెలగబెట్టిన ఆమెకు తెలియదా అని ప్రశ్నించారు. దీనిపై కోర్టు సరైన తీర్పునిచ్చిందన్నారు. ఓటరు జాబితా బాగోలేదంటూ శశిధర్‌ రెడ్డి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, చివరకు కోర్టు కూడా ఎన్నికల కమిషన్‌ అధికారాలను ప్రశ్నించలేదన్నారు. దమ్ముంటే శశిధర్‌ రెడ్డి తలసానిపై పోటీచేసి గెలవాలని సవాలు విసిరారు.

సాగునీటి ప్రాజెక్టులపై కోర్టుకెళ్లి అడ్డుపడుతున్న కాంగ్రెస్‌కు కోదండరాం, కమ్యూనిస్టు పార్టీల నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారని, బాబు జోలికి మేము వెళ్లకున్నా ఆయనే మా జోలికి వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ ఉనికే లేదన్నారు. కాంగ్రెస్‌లో చేరాల్సిన ఖర్మ తనకు పట్టలేదని, తన రాజకీయ జీవితమంతా ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉందని స్పష్టం చేశారు. ముషీరాబాద్‌ నుంచి తన అల్లుడు స్వతంత్రంగా పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top