ప్రజల గొంతు నొక్కేస్తున్నారు.. | Mallu Bhatti Vikramarka Fire On KCR | Sakshi
Sakshi News home page

ప్రజల గొంతు నొక్కేస్తున్నారు..

Apr 29 2019 7:13 AM | Updated on Apr 29 2019 7:13 AM

Mallu Bhatti Vikramarka Fire On KCR - Sakshi

భద్రాచలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న భట్టి

భద్రాచలంటౌన్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ప్రజాగొంతుకను నొక్కేస్తోందని కాంగ్రెస్‌ శాససనభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో ఆయన పర్యటించారు. అంతకుముందు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరులతో, ఆ తర్వాత ఆయా మండలాల్లో జరిగిన సభల్లో భట్టి మాట్లాడారు.

భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం అపహాస్యం చేశారని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్‌ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం రీ డిజైన్‌ చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని విమర్శించారు.

ఈ దోపిడీపై అసెంబ్లీలో నిలదీస్తున్నందుకే ప్రతిపక్ష కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. వేలాది మంది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసి టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను  నిలదీయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎమ్మెల్యేలు చెపుతున్నా.. అది నిజం కాదని, వారి సొంత ప్రయోజనాల కోసమే ఆ పని చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు కళ్ల లాంటివని చెప్పారు. కేసీఆర్‌కు పాలన మీద దృష్టి లేదని, ఫాంహౌస్‌లో కూర్చుని అధికారం చెలాయిస్తున్నాడని విమర్శించారు.

ఇంటర్‌ బోర్డు లో అవకతవకలతో ఫెయిలైన విద్యార్థుల్లో 23 మంది ఆత్మహత్య చేసుకున్నా ఫాంహౌస్‌ నుంచి బయటకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యార్థులు చనిపోయి వారి తల్లిదండ్రులు ఏడుస్తుంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకే ప్రజా పరిరక్షణ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్‌ కూటమి అభ్యర్థులను గెలిపించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలన్నారు.

బూర్గంపాడు జెడ్పీటీసీ కాంగ్రెస్‌ అభ్యర్థి బాదం సావిత్రిని గెలిపించాలని కోరారు. అంతకు ముందు బూర్గంపాడు ప్రధాన కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ చందా లింగయ్య, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసన్, కాంగ్రెస్‌ నాయకులు బొలిశెట్టి రంగారావు, డీసీసీ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ బోగాల శ్రీనివాసరెడ్డి, బూర్గంపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బాదం సావిత్రి, సర్పంచ్‌లు సిరిపురపు స్వప్న, భూక్యా శ్రావణి, కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, మందా నాగరాజు, భజన సతీష్, తాళ్లూరి జగదీశ్వరరావు, పోటు రంగారావు, లక్కోజు విష్ణువర్ధన్, దుద్దుకూరి ఠాగూర్, బాదం నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.

రాక్షస పాలనను అంతం చేయాలి 
కొత్తగూడెంరూరల్‌: ఇంటర్‌ బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన పాలకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెంలో  విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని, దీన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ అవినితీకి పాల్పడుతూ రాజ్యంగాన్ని లెక్కచేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కారని అన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఏనుగుల అర్జున్‌రావు, మోతుకూరి ధర్మారావు, రాందాస్, నాగ సీతారాములు, శౌరి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement