అనుకున్నదొక్కటి, అయిందొకటి!

Pranb_Sonia

ప్రధానమంత్రి పదవి వస్తుందనుకున్నా

మన్మోహన్‌ సింగ్‌ను రాష్ట్రపతిని చేస్తారనుకున్నా

తన పుస్తకంలో వివరించిన ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా తనను ప్రధానమంత్రిని చేస్తారని అనుకున్నట్టు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పేర్కొన్నారు. 1996 నుంచి 2012 వరకు జరిగిన పరిణామాలపై తాను రాసిన ‘ద కొలిషన్‌ ఇయర్స్‌’  పుస్తకంలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.

‘2012 రాష్ట్రపతి ఎన్నిక సమయంలో జూన్‌ 2 సాయంత్రం సోనియా గాంధీని కలిశాను. రాష్ట్రపతి ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎంపిక చేసేందుకు, వారికి ఏవిధంగా మద్దతు కూడగట్టాలనే దానిపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగింది. ప్రభుత్వంలో మీరు కీలక పాత్ర పోషిస్తున్నారని, మీకు ప్రత్యామ్నాయం ఎవరో సూచించాలని ఈ సందర్భంగా సోనియా నన్ను అడిగారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడతానని చెప్పాను. ఎటువంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తానని అన్నాను. నా వైఖరిని సోనియా ఎంతోగానో మెచ్చుకున్నారు. భేటీ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాను.

యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా మన్మోహన్‌ సింగ్‌ను ఖరారు చేస్తారని అనుకున్నాను. ఆయన రాష్ట్రపతిగా ఎన్నికైతే, సోనియా.. నన్ను ప్రధానిగా ప్రతిపాదిస్తారని భావించాను. అయితే నేను ఊహించిన దానికి భిన్నంగా రాష్ట్రపతి ఎన్నిక కోసం నాతో పాటు, హమిద్‌ అన్సారీ పేరును సోనియా ప్రతిపాదించారు. జూన్‌ 13న సోనియా, మమతా బెనర్జీ కలిశారు. ప్రణబ్‌, హమిద్‌ అన్సారీలను అభ్యర్థులుగా ఎంపిక చేసినట్టు మమతకు సోనియా తెలిపారు. మా ఇద్దరితో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అనే విషయంపై ములాయం సింగ్‌ యాదవ్‌తో చర్చించిన తర్వాత చెబుతానని మమతా బెనర్జీ తెలిపినట్టు తర్వాత నాతో సోనియా చెప్పారు. మా ఇద్దరినీ కాదని ములాయం, మమత.. ఏపీజే అబ్దుల్‌ కలాం, మన్మోహన్‌ సింగ్‌, సోమనాథ్‌ ఛటర్జీ పేర్లను వారు తెరపైకి తెచ్చారు. మరోసారి సోనియాతో మమత భేటీ అయ్యారు. ప్రణబ్‌, అన్సారీ.. వీరిద్దరిలో ఎవరు ఆమోదయోగ్యం కాదో చెప్పాలని మమతను సోనియా కోరారు.

జూన్‌ 14న సోనియాను కలిశాను. మమత బెనర్జీతో చర్చించిన విషయాలను నాకు చెప్పారు. ములాయంతో చర్చించిన తర్వాత తన నిర్ణయం చెప్పకపోవడం, భేటీ వివరాలను మీడియాకు వెల్లడించడంతో మమతపై సోనియా అసంతృప్తి వ్యక్తం చేశారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీ కోర్‌ కమిటీ సమావేశంలో చర్చించడం మంచిదని సోనియా అన్నారు. ఏకే ఆంటోని, చిదంబరం, అహ్మద్‌ పటేల్‌, నేను, ప్రధాని ఈ సమావేశంలో పాల్గొన్నాం. నా అభ్యర్థిత్వంతో పార్టీ, ప్రభుత్వంలో తలెత్తె పరిణామాల గురించి చర్చించాం. సోనియా, తాను కలిసి తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేసినట్టు ఆ రోజు సాయంత్రం నాకు మన్మోహన్‌ సింగ్‌ సమచారం ఇచ్చార’ని ప్రణబ్‌ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

2004 సాధారణ ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని చేపట్టేందుకు సోనియా గాంధీ నిరాకరించడంతో తాను ప్రధానమంత్రి అవుతానని భావించినట్టు ఆయన పేర్కొన్నారు. శరద్‌ పవార్‌ కూడా ప్రధాని పదవి ఆశించారని వెల్లడించారు. రాజీవ్‌ గాంధీ తర్వాత కీలక సమయంలో పివి నరసింహారావు సుస్థిరమైన నాయకత్వం అందించారని ప్రశంసించారు. ఆర్థిక, విదేశాంగ విధానాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని గుర్తు చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top