సీఎం ముఖ్య కార్యదర్శిపై ఆరోపణలు

Corruption Allegations on Yogi Adithyanath PS - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ ముఖ్య కార్యదర్శి ఎస్పీ గోయల్‌పై అవినీతి ఆరోపణలు రాష్ట్రంలో కలకలం సృష్టించాయి. గవర్నర్‌ రామ్‌ నాయక్‌ స్వయంగా జోక్యం చేసుకుని యోగికి లేఖ రాయటం, ప్రతిపక్ష నేత అఖిలేష్‌ యాదవ్‌ సీబీఐ దర్యాప్తుకు డిమాండ్‌ చేయటంతో రాజకీయ దుమారం చెలరేగింది. 

ఆరోపణలు.. హర్దోయ్‌లో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటు విషయంలో అభిషేక్‌ గుప్తా అనే వ్యాపారవేత్త.. గోయల్‌ను సంప్రదించాడు. అయితే రోడ్డు వెడల్పు కోసం అదనపు స్థలం(ఒక్క అడుగు) కోరినందుకు గోయల్‌ రూ. 25 లక్షలు డిమాండ్‌ చేశారన్నది అభిషేక్‌ ఆరోపణ. ఈ మేరకు గవర్నర్‌ రామ్‌ నాయక్‌కు అభిషేక్‌ ఏప్రిల్‌ 18వ తేదీన ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో గవర్నర్‌ ఏప్రిల్‌ 30వ తేదీన సీఎం యోగి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తూ ఓ లేఖ రాయగా, సీఎం యోగి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే ఎలా జరిగిందో తెలీదుగానీ గురువారం రాత్రి ఈ లేఖ తాలూకూ ఫోటో ఒకటి వైరల్‌ కావటంతో దుమారం మొదలైంది.

గోయల్‌ మాత్రం అవినీతి ఆరోపణలను తోసిపుచ్చినప్పటికీ, అభిషేక్‌ మాత్రం తన దగ్గర ఆధారాలున్నాయని వాదించటంతో విషయం రాజకీయ మలుపు తిరిగింది. ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ను పిలిపించుకుని ఈ వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా సీఎం యోగి కోరారు. మరోవైపు సమాజ్‌వాదీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

చివర్లో... అభిషేక్‌ గుప్తాను శుక్రవారం అదుపులోకి తీసుకున్న పోలీసులు మూడున్నర గంటలుగా విచారణ చేపట్టి ఆ ఆరోపణలు అబద్ధమని తేల్చారు. ‘అభిషేక్‌ గతంలో పలువురి బీజేపీ నాయకుల పేర్లను వాడుకుని కాంట్రాక్టర్లను, అధికారులను బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు గోయల్‌ లంచం కోరారని చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తేలింది’  అని పేర్కొన్నారు. మరోపక్క అభిషేక్‌ క్షమాపణలు చెప్పినట్లు ఉన్న వీడియో టేపు ఒకదానిని సీఎం ఆఫీస్‌ మీడియా సలహాదారు మృత్యుంజయ్‌ కుమార్‌ విడుదల చేయటం విశేషం. 

రాత్రికి రాత్రే కేసు?... గురువారం రాత్రి గవర్నర్‌ రామ్‌ నాయక్‌ రాసిన లేఖ తాలూకు ఫోటో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. అయితే అదే రాత్రి యూపీ బీజేపీ విభాగం అభిషేక్‌పై ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతల పేర్లు వాడుకుంటూ అభిషేక్‌ దందాలు చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో శుక్రవారం ఉదయం పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రశ్నించారు. అభిషేక్‌ సోదరి, అతని తాత సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే అభిషేక్‌ను పోలీసులు విడిచిపెట్టిన తర్వాత వారు ఆందోళన విరమించారు. పోలీసులు మాత్రం అభిషేక్‌పై నమోదైన కేసుల దర్యాప్తు కొనసాగుతుందని చెబుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top