బాబు బడాయి!

CM Meeting Late Starts in Tirupati Womens Suffered Hungry - Sakshi

ఎన్నికల సభను తలపించిన జలహారతి సభ

ఆద్యంతం జగన్‌పైనే విమర్శలు

రావడమే 3.30 గంటల ఆలస్యం

తిరుపతిలో భోజనం లేక విలవిల్లాడిన మహిళలు

సీఎం వచ్చేంతవరకు వేచి ఉండాలని అధికారుల వేడుకోలు

పోలీసులతో టీడీపీ నాయకుల గలాట

మదనపల్లి: ‘‘ఈ ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఎంతో చేసింది. నాపై నమ్మకంతోనే రాష్ట్రానికి ఐటీ కంపెనీలు వచ్చాయి. పరిశ్రమలు వెలిశాయి. ప్రభుత్వం కష్టాల్లో ఉన్నా రుణమాఫీ చేశాం. అక్కాచెల్లెమ్మలను ఆదుకున్నాం.. ఎన్నో కోట్లు ఖర్చుచేసి జిల్లాకు హంద్రీ–నీవా నీటిని తీసుకొచ్చాం. ఇక సాగునీటికి ఢోకా ఉండదు.. తాగునీటికి అవస్థలుండవు..’’ అంటూ సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుని మురిసిపోయారు. జలహారతి కార్యక్రమంలో భాగంగామదనపల్లె, పుంగనూరు, పలమనేరులో జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు.

అనంతరం తిరుపతిలోని  అలిపిరిలో జరిగిన సభకు హాజరయ్యారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌పై ప్రతి సభలోనూ తీవ్ర విమర్శలు చేశారు. మరోసారి తనకు అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలకు విలువల్లేవని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జలహారతి సభను ఎన్నికల కోసం నిర్వహించిన సభగా మార్చేశారని విజ్ఞులు పెదవి విరుస్తున్నారు. ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించిన సభల్లో ఏ మాత్రం సంకోచం లేకుండా నాకు ఓటేయండని అడుగుతుండడంపై టీడీపీ నాయకులే గుసగులాడుతున్నారు. ప్రభుత్వ సభలను ఎన్నికల ప్రచార సభలుగా మారుస్తున్నారని మండిపడుతున్నారు.

3 గంటల ఆలస్యం..
సీఎం సభ ఆద్యంతం 3 గంటల వరకు ఆలస్యంగా నడిచింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 10.30 గంటలకు రావాల్సి ఉంది. మనదపల్లెకు  మధ్యాహ్నం 1.30 గంటలకు సభాప్రాంగణానికి వచ్చారు. హంద్రీ–నీవా జలాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. సుమారు గంట సేపు ప్రసంగించారు. పుంగనూరులో జలహారతి కార్యక్రమానికి 1.30 గంటలకు హాజరవ్వాల్సి ఉండగా 3 గంటల ఆలస్యంగా వెళ్లారు. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గుండ్రాజువరంలో జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి సభ ప్రారంభమయ్యేసరికి చీకటి పడింది. సభకు హాజరైన వారికి కనీసం భోజన ఏర్పాట్లు కూడా చేయలేదు. సీఎం రాకముందే మహిళలు ఇళ్లకు వెళ్లిపోయారు. అధికారులు బతిమలాడినా ప్రయోజనం లేకుండా పోయింది. తిరుపతి మున్సిపల్‌ స్కూల్‌ పిల్లలను సెలవు అని చూడకుండా సభకు తరలించారు. వారు ఆకలికి అలమటించారు.

ఎప్పుడూ లేటేనా?
ఈ ఐదేళ్లలో జిల్లాకు వచ్చిన ప్రతిసారీ సీఎం చంద్రబాబు నాయుడు కనీసం 2 గంటలు ఆలస్యంగా వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. పెన్షన్‌ కట్‌ చేస్తాం, డ్వాక్రా రుణాలు ఇవ్వం అంటూ బెదిరిస్తుంటే వస్తున్నామని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు కనీసం భోజనం కూడా పెట్టకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంటారని మదనపల్లి సీటీఎంకు చెందిన ఓ వృద్ధురాలు వాపోయిం ది. సోమవారం జరిగిన సభలో కొంతమంది వృద్ధులు ఆకలికి తట్టుకోలేక కళ్లు తిరిగిపడిపోయారు.

టీడీపీ నాయకుడి ఓవరాక్షన్‌..
సీఎం సభలో టీడీపీ నాయకుడు పులివర్తి నాని ఓవరాక్షన్‌ చేశారు. ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే టీడీపీ నాయకుల జాబితాలో లేని వారిని తీసుకొచ్చి సభలోకి అనుమతించాలని ఆయన పట్టుబట్టారు. వారు ససేమిరా అనడంతో ఆయన పోలీసులపై సీరియస్‌ అయ్యారు. మా పార్టీ సభకు మమ్మల్నే పంపించరా..? అంటూ చిందులేశారు. అయినా పోలీసులు నాని అనుచరులను లోపలికి అనుమతించలేదు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top