రాజకీయంగా ఎదుర్కోలేకే ఫ్యాక్షన్‌కు బీజం

Ananta Venkat Ramreddy Slams Chandrababu Naidu - Sakshi

జిల్లాలో రాక్షస పాలన     

అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా మారారు

ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నామనే విషయం మర్చిపోయారు

తాడిపత్రి డీఎస్పీ, సీఐల నియామకాలపై అనుమానాలు

వైఎస్సార్‌సీపీ నేతలు అనంత, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపాటు  

అనంతపురం సెంట్రల్‌: ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న సమయంలో రాజకీయంగా ఎదుర్కోలేక అధికార తెలుగుదేశం పార్టీ నేతలు అల్లర్లు, ఫ్యాక్షన్‌కు బీజం వేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిలు ఆరోపించారు. గురువారం తాడిపత్రి నియోజకవర్గ సమన్వకర్త  కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ను ఆయన చాంబర్‌లో కలిసి ఫిర్యాదు చేశారు. 

కేసుల్లో ఇరికించేందుకు కుట్ర
ఎన్నికలు వస్తున్న తరుణంలో ఫ్యాక్షన్, అల్లర్లకు రెచ్చగొట్టి ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమ కేసుల్లో ఇరికించాలని అధికారపార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం తదితర నియోజకవర్గాల్లో పోలీసులు తమ కార్యకర్తలు, నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. తాడిపత్రిలో నాలుగు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయిన వారిని తీసుకొచ్చి మళ్లీ గొడవలకు ఆజ్యం పోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల 14 నుంచి 29 వరకు కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లి గ్రామానికే పోలేదన్నారు. అయితే వైఎస్సార్‌సీపీ కార్యకర్త బాషాను అన్యాయంగా అధికార పార్టీ నేతలు కొట్టారన్నారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళితే మీరు ఫిర్యాదు చేస్తే మీపై కౌంటర్‌ కేసులు నమోదు చేస్తామని తాడిపత్రి రూరల్‌ సీఐ నారాయణరెడ్డి బెదిరించారన్నారు. రాత్రికిరాత్రే కుట్ర పన్ని పెద్దారెడ్డిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

పోలీసు నియామకాలపై అనుమానాలు
జిల్లాలో అనేక మంది సీఐలకు పోస్టింగ్‌లు లేకుండా పక్కన ఉంచారని కేతిరెడ్డి పేర్కొన్నారు. అయితే ఇటీవల పదోన్నతి పొందిన నారాయణరెడ్డిని తాడిపత్రి రూరల్‌ సీఐగా నియమించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. స్వామిభక్తిని నిరూపించుకోవడానికే ఆయన్ను ఇక్కడకు వేశారని తెలుస్తోందన్నారు. డీఎస్పీ విజయ్‌కుమార్‌ నియామకంపైనా అనుమానాలు ఉన్నాయన్నారు. తన తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాప్‌రెడ్డి హత్య సమయంలో సీఐగా పనిచేశారన్నారు. అప్పట్లో ఆయన సీఐగా సరిగా పనిచేయకపోవడం వలనే ఆ హత్య జరిగిందని ఆరోపించడంతో బదిలీ చేశారన్నారు. తిరిగి ఇప్పుడు డీఎస్పీగా ఆయన్నే ఇక్కడకు నియమించుకున్నారన్నారు. పోలీసులకు దివాకర్‌రెడ్డినే జీతాలు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్మును జీతంగా తీసుకొని పనిచేస్తున్నామనే విచక్షణ మరిచి పోలీసులు వ్యవహరిస్తుండడం బాధాకరమన్నారు. తాము పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

రామగిరి ఏమైనా పీఓకేనా?
‘ప్రతిపక్ష నాయకులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అణగదొక్కుతున్నారు. రామగిరి మండలంలోకి వెళ్లాలంటే అనుమతి లేదంటారు.. అదేమైనా పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీరా (పీఓకే)’ అని ప్రశ్నించారు. ప్రజస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా అని నిలదీశారు. తమకు న్యాయం జరగకపోతే త్వరలో జిల్లా వ్యాప్తం గా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించా రు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరు సాంబశివారెడ్డి, నాయకులు నార్పల సత్యనారాయణరెడ్డి, కార్పొరేటర్‌ బాలాంజనేయులు, రాజేష్‌ పాల్గొన్నారు.

ఓట్ల కోసం ఫ్యాక్షన్‌కు ఆజ్యం
యల్లనూరు, పుట్లూరు మండలాల్లో తొలి నుంచి తమ కుటుంబానికి ప్రజల మద్దతు ఉందని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. జేసీ దివాకర్‌రెడ్డి ఎంపీ అయిన తర్వాత ఓట్లు సంపాదించుకోవాలనే లక్ష్యంతో ఈ రెండు మండలాల్లో ఫ్యాక్షన్‌ను ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. గ్రామంలో పోలీసు పికెటింగ్‌ ఉన్నా తమ కార్యకర్త బాషాపై దాడి చేశారన్నారు. పోలీసుల బెదిరింపులతో ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. అయితే గొడవలు జరిగేందుకు ఆస్కారం ఉన్న సమయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది పోయి చిన్న సంఘటనను భూతద్దంలో చూపించి పెద్దారెడ్డిపై ఏకంగా నాన్‌బెయిలబుల్‌ కేసు అక్రమంగా నమోదు చేశారన్నారు.   

పెద్దారెడ్డిని జైలుకుపంపడం దుర్మార్గం - ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
అనంతపురం: వైఎస్సార్‌సీపీ తాడిపత్రి సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డిపై అక్రమంగా నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపడం దుర్మార్గమని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంబంధం లేని కేసులో పెద్దారెడ్డిని ఇరికించడం పోలీసుల దమనకాండకు నిదర్శనం అని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి, అక్రమ అరెస్టులు చేయించి మరోసారి అధికారంలోకి రావడానికి కుయుక్తులు పన్నుతోందని ధ్వజమెత్తారు. పెద్దారెడ్డిపై కేసును ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top