దేశ ఆర్థిక రాజధాని ముంబై అంటే మహిళలు హడలెత్తిపోతున్నారు.
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై అంటే మహిళలు హడలెత్తిపోతున్నారు. ఈ మహానగరంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే గత మూడు నెలల్లో కిడ్నాప్లు, రేప్ల సంఖ్య 165 శాతం పెరిగాయి. గణాంకాల అధ్యయనం నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఇక ఆర్టీఐ సమాచారం మేరకు అత్యాచారాల సంఖ్య 43 శాతం పెరిగింది.
ముంబైలో గత జనవరి నుంచి మార్చి వరకు 172 అత్యాచార కేసులు నమోదైనట్టు సామాజిక కార్యకర్త చేతన కొఠారి వెల్లడించారు. గతేడాది ఇదే సమయంలో 138 కేసులు నమోదయ్యాయి. గతేడాది తొలి మూడు నెలల్లో 76 కిడ్నాప్ కేసులు రాగా, ఈ ఏడాది ఆ సంఖ్య 202కు పెరిగింది. ఇదిలావుండగా, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారానికి పాల్పడిన కేసులు 95 శాతం ఉన్నాయని ఓ ఐపీఎస్ అధికారి చెప్పారు. 5 శాతం మాత్రమే మహిళలపై లైంగిక దాడుల కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. ఇక పిల్లల కిడ్నాప్ల కేసుల్లో తెలిసిన వారే నిందితులుగా మారుతున్నారని చెప్పారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.