
న్యూఢిల్లీ: విధి నిర్వహణలో చనిపోయిన, వైద్య కారణాలతో పదవీవిరమణ చేసిన ఉద్యోగుల భార్యలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగం ఇవ్వడానికి కావాల్సిన కనీస విద్యార్హతను రద్దుచేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం లెవల్–1 లేదా గ్రూప్–డి విభాగంలో కారుణ్య నియామకానికి కనీసం పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.
కారుణ్య నియామకాల విషయం లో చాలామంది మహిళలకు కనీస విద్యార్హత లేకపోవడాన్ని పలు రైల్వే జోన్లు తమ దృష్టికి తీసుకొచ్చాయని రైల్వేబోర్డు తెలిపింది. దీంతో కనీస విద్యార్హత నిబంధనను రద్దుచేశామంది. కొద్దిపాటి శిక్షణతో ఈ మహిళలు విధులు నిర్వర్తించగలరని ఉన్నతాధికారులు సంతృప్తి చెందితే కారుణ్య నియామకాలు చేపట్టవచ్చంది. ఈ మేరకు రైల్వేబోర్డు ఏప్రిల్ 6న అన్ని జోనల్ కార్యాలయాలకు లేఖ రాసింది.