చెట్టంత కొడుకే పోయాడు.. ఆ బూడిదతో ఏం పని?

Old Couple Lost Their Son To Cancer In AIIMS Subway - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక  మాకేం అనుకున్నారు ఆ వృద్ధ దంపతులు. కలో గంజో తాగి పిల్లలను పెంచి పెద్దవాళ్లను చేశారు. ఇక వాళ్లు ఏదో ఒక పని చేసుకొని బతికితే చాలు.. తమ కష్టాలన్నీ తీరినట్లే అనుకున్నారు. కానీ ఇంతలోనే విధి వారిని మరో రకంగా పలకరించింది. పెద్దోడిని క్యాన్సర్‌ సోకింది. ఇలాంటి సమయంలో తోడుగా ఉండాల్సిన చిన్నోడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. పెద్ద కొడుకు జబ్బు నయం అవుతుంది.. తిరిగి ఇంటికెళ్తామనే ఆశాభావంతో పుట్‌పాత్‌పై జీవిస్తూ మంచి రోజుల కోసం ఆశగా ఎదురు చూశారు. కానీ దేవుడు కనికరించలేదు. జబ్బున పడ్డ కొడుకు మరణించాడు. అయితే లాక్‌డౌన్‌ పుణ్యమా అని తల్లిదండ్రులు... కొడుకు అంత్యక్రియలు కూడా జరపలేకపోయారు. ఈ హృదయ విదారక ఘటన గత  శుక్రవారం న్యూఢిల్లీలోని నిమ్స్‌ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...బీహార్‌కు చెందిన గొర్రెల కాపరి సర్జ్‌దాస్‌(70), మీనాదేవి(65) దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సంజయ్‌ దాస్‌ (30) కూడా అదే వృత్తిని కొనసాగిస్తున్నాడు. గుట్కాలకు అలవాటు పడిన సంజయ్‌కు తొమ్మిది నెలల క్రితం నోటి క్యాన్సర్‌ సోకింది. చికిత్స కోసం పట్నా, బెంగళూరులోని ప్రముఖ ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. అయినప్పటికీ జబ్బు నయం కాలేదు. దీంతో చివరి ఢిల్లీలోని ఏయిమ్స్‌ అస్సత్రిలో చేర్పించారు. కొడుకుకు తోడుగా వచ్చిన ఆ వృద్ధ దంపతులు అక్కడి పుట్‌పాత్‌పై జీవిస్తూ కాలం గడుపుతున్నారు.  ఈ సమయంలో తోడుగా ఉండాల్సిన కోడలు (సంజయ్‌ భార్య).. పుట్టింటికి వెళ్లిపోయింది. ఆసరాగా ఉంటాడనుకున్న చిన్న కొడుకు ఇంట్లో నుంచి పారిపోయాడు. అయినప్పటికీ ఆ దంపతులు కలత చెందలేదు. ఎప్పటికైనా పెద్ద కొడుకుకి జబ్బు నయం అవుతుంది తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చనే ఆశతో అక్కడే ఉన్నారు. కానీ విధి వారి ఆశలపై నీళ్లు చల్లింది. చికిత్స పొందుతున్న సంజయ్‌  గత శుక్రవారం ఉదయం మృతి చెందాడు. 

‘గత కొద్దిరోజులుగా ఈ వృద్ధ దంపతులు పుట్‌పాత్‌నే నివాసంగా చేసుకున్నారు. సర్జ్‌దాస్‌ కడుపు నొప్పితో బాధపడుతున్నా తట్టుకుంటూ... కొడుకు రోగం తగ్గిపోతే ఇక ఇంటికి వెళ్లిపోతామనే ఆశగా ఎదురు చూసేవాడు. కానీ శుక్రవారం సంజయ్‌ దాస్‌ మృతి చెందారు. వైద్యులు ఈ విషయం చెప్పగానే ఆ వృద్ధ దంపతులను దుఃఖానికి అంతులేదు. వైద్యులు కొడుకు మృతదేహాన్ని అప్పగించగా.. తీసుకెళ్లడానికి వారికి తోడుగా ఎవరూ రాలేదు. మీనా దేవి ఒక్కతే కొడుకు శవంపై ఏడుస్తూ ఉంది. అసలు వారు ఎక్కడి వెళ్లాలో కూడా తెలియదు. చివరకి ఆస్పత్రి ఆవరణంలో ఉన్నఎలక్ట్రిక్ క్రిమటోరియంలో అతని అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం ఎప్పటి మాదిరే ఆ వృద్ధ దంపతులు ఇక్కడి వచ్చి ఉంటున్నారు. వారికి ఎవరూ లేదు. ఎక్కడికి వెళ్లలేము ఇక్కడే ఉంటామని చెప్పారు’ అని వారితో పాటు అక్కడే ఉంటున్న మురాద్ ఖుష్వాహా అనే మహిళ మీడియాతో చెప్పారు. ఆమె కూడా క్యాన్సర్‌ బారిన పడిన తన ఐదేళ్ల కూతురి చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కి వచ్చారు.

ఇక కొడుకు అంత్యక్రియలు చేశారు కదా.. మరి బూడిద అయినా తీసుకొచ్చారా అని  ఓ వ్యక్తి సర్జ్‌దాస్‌ను అడగ్గా.. ‘ చెట్టంత కొడుకే పోయాడు..ఇక ఆ  బూడిదతో నేనేం చేస్తాను. మా స్వంత ఊరు ఎక్కడ ఉందో మాకే తెలియదు’ అని కన్నీటిపర్యంతమయ్యాడు. ‘ఇక దేవుడుపై భారమేసి బతుకుతున్నాం. లాక్‌డౌన్‌ పుణ్యమా అని ప్రతి రోజు ఆహారం అందుతుంది. ఎవరెవరో వచ్చి అన్నంపెట్టి పోతున్నారు. లాక్‌డౌన్‌ మరిన్ని రోజులు కొనసాగాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాం’ అని సర్జ్‌ అన్నారు. ‘లాక్‌డౌన్‌తో వారు ఎక్కడికి వెళ్లలేకపోతున్నారు. అంబులెన్స్‌లో వారిని ఇంటికి పంపిద్దామంటే దాదాపు రూ.50 వేలు ఖర్చు అవుతుంది. అంత మొత్తం వాళ్ల దగ్గరలేవు. ఎవరూ ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం వాళ్లిద్దరూ మాతోనే ఉన్నారు. మేము తినే దాంట్లో కొంచెం వారికి పెడుతున్నాం’ అని అక్కడే ఉన్నవారు అంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top