
సాక్షి, హైదరాబాద్ : భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోన్న కేరళకు తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం కేసీఆర్ రూ.25 కోట్లను తక్షణ సహాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చెక్కును తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆదివారం నాడు కేరళ వెళ్లి ఆ రాష్ట్ర సీఎం విజయన్‌కు అందజేశారు. మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీలు కూడా కేరళ వరద బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. టీఆర్‌ఎస్ భవన్‌లో ఎంపీ కేశవరావు ఆదివారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన 20 మంది ఎంపీల ఒక నెల వేతనాన్ని(మొత్తం 20 లక్షల రూపాయలు) కేరళ సీఎం రీలిఫ్ ఫండ్‌కు అందజేయనున్నామని తెలిపారు.
ఈ విషయాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా ట్విటర్ ద్వారా వెల్లడించారు. తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా తమ నెల వారి జీతాలను కేరళ వరద బాధితులకు విరాళంగా అందజేయనున్నామని తెలిపారు. కేరళ సోదరి, సోదరులను ఆదుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇండియా ఫర్ కేరళ, తెలంగాణ ఫర్ కేరళ అని హ్యష్ ట్యాగ్‌లు ట్వీట్‌కు జత చేశారు.