
తమిళనాడుకు కేంద్రం ఆపన్న హస్తం
వర్దా తుపాను తాకిడికి గురైన తమిళనాడుకు అన్నిరకాలుగా సహాయపడతామని కేంద్ర ప్రభుత్వం భరోసాయిచ్చింది.
చెన్నై: వర్దా తుపాను తాకిడికి గురైన తమిళనాడుకు అన్నిరకాలుగా సహాయపడతామని కేంద్ర ప్రభుత్వం భరోసాయిచ్చింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఓ పన్నీరు సెల్వంకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. వర్దా తుపాను కారణంగా తమిళనాడులో తలెత్తిన పరిస్థితుల గురించి తెలుసుకునేందుకు పన్నీరు సెల్వంకు రాజ్ నాథ్ ఫోన్ చేశారు.
చెన్నై, కాంచిపురం, తిరువళ్లూరు ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లినట్టు రాజ్ నాథ్ కు సీఎం తెలిపారు. ముందుస్తుగా అన్ని చర్యలు చేపట్టామని, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్లను అప్రమత్తం చేశామని వివరించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, నావికా దళాలను సిద్ధం చేశామని చెప్పారు. తుపాను ముప్పు ఎదుర్కొన్న తమిళనాడుకు అవసరమైన సాయం చేస్తామని రాజ్ నాథ్ సింగ్ హామీయిచ్చారు. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.